రెడ్డి జాగృతి కమిటీ డిమాండ్
హైదరాబాద్: విద్య, ఉద్యోగాల్లో రెడ్లలోని పేదలకు రిజర్వేషన్లు కల్పించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింప చేయాలని రెడ్డి జాగృతి కమిటీ డిమాండ్ చేసింది. రెడ్లలోని పేదల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలంటూ ఆదివారం హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి జాగృతి కమిటీ అధ్యక్షుడు పి.శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా ఎక్కువ శాతం మంది రెడ్లే అయినప్పటికీ ఆ కులంలోని పేదల పక్షాన అసెంబ్లీ లో, పార్లమెంటులో ఒక్కనాడూ మాట్లాడింది లేదని, వారి సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు.
చాలా మంది రెడ్లు వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతూ అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, రిజర్వేషన్ల కారణంగా ప్రతిభ ఉన్నా విద్య, ఉద్యోగాల్లో అవకాశం దక్కక, కుటుంబాల పరిస్థితిని చూసి తట్టుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రెడ్డి కులంలోని పేదలకు విద్య, ఉద్యోగ రంగాల్లో ప్రత్యేక రిజర్వేషన్ కోటాను కల్పించాలని, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తింప చేయాలని, సంక్షేమ హాస్టళ్ల సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. రెడ్లలో పేదల జీవన పరిస్థితిని అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక కమిషన్‌ను నియమించాలని, వారి సంక్షేమం కోసం ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించాలని అన్నారు. నాయకులు మహేందర్‌రెడ్డి, రమణారెడ్డి, తిమ్మల్‌రెడ్డి, వసంతరెడ్డి, అనితారెడ్డి, సుకన్యరెడ్డి తదితరులు మాట్లాడారు.
పేద రెడ్లకు రిజర్వేషన్లు కల్పించాలి
Published Mon, Jun 27 2016 1:13 AM | Last Updated on Wed, Sep 5 2018 9:18 PM
Advertisement