ఎస్టీ విద్యార్థినులకు రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు
- ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం
- ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్టీ విద్యార్థినుల కోసం ప్రత్యేకంగా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఇప్పటికే ఎస్సీ విద్యార్థినుల కోసం జారీ చేసిన 30 డిగ్రీ కళాశాలల తరహాలో ఎస్టీ విద్యార్థినులకు డిగ్రీ రెసిడెన్షియల్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై మంగళ వారం ప్రగతిభవన్‌లో సంబంధిత అధికారులతో సీఎం సమీ క్షించారు. 2017–18 విద్యా సంవత్సరం నుంచే ఈ కాలేజీల ను ప్రారంభించాలని సూచించారు. ఎన్ని డిగ్రీ రెసిడెన్షియల్స్ ప్రారంభించాలి, ఎక్కడెక్కడ ఏర్పాటుకు అవకాశాలున్నా యనే అంశాలను పరిశీలించాలని ఆదేశించారు.
మెస్ చార్జీల పెంపుపై కృతజ్ఞతలు
విద్యార్థుల మెస్ చార్జీలు పెంచడం పట్ల వివిధ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో పలు బీసీ సంఘాల నేతలు మంగళవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలసి పుష్పగుచ్చం అందించి కృతజ్ఞతలు తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాసగౌడ్, జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, బీసీ ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ ఎర్ర సత్యనారాయణ, సర్పంచుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు భూమన్న యాదవ్, బీసీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.కృష్ణుడు, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీల వెంకటేష్ తదితరులు కేసీఆర్‌ను కలిశారు.
మెస్ చార్జీలు పెంచడం వల్ల విద్యార్థులకు మంచి ఆహారం లభిస్తుందని, రేపటి పౌరులు చక్కగా ఎదగడానికి ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. ఇక విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచినందుకు ఎంబీసీల సంఘం సీఎంను అభినందించింది. సంఘం అధ్యక్షుడు కాళప్ప, నాయకులు సూర్యారావు, ప్రేమ్ లాల్, శేఖరాచారి, నర్సింగరావు, అంతయ్య, సత్యం వంశిరాజు, విష్ణువర్థన్ రాజు, శ్రీనివాసరావు, టీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కారెం రవీందర్‌రెడ్డి, గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. శ్రీనివాసరెడ్డి తదితరులతోపాటు ఎంపీ బాల్క సుమన్ ఆధ్వర్యంలో పలువురు విద్యార్థి నాయకులు, విద్యార్థులు సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
‘హోటళ్ల’ సమస్యలు తీర్చండి
హోటల్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ నాయకులు వెంకటరెడ్డి నాయకత్వంలో పలువురు నేతలు సీఎం కేసీఆర్‌ను కలసి తమ సమస్యలు విన్నవించారు. కేంద్రం అమలు చేస్తున్న పన్నుల విధానంతో హోటళ్ల నిర్వహణ కష్టంగా ఉందని చెప్పారు. ప్రధాని వద్దకు తమ ప్రతినిధి బృందాన్ని తీసుకెళ్లి సమస్యలు వివరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారు.