హైదరాబాద్ : నూతన సంవత్సరం సందర్భంగా జరిగే వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. న్యూ ఇయర్ వేడుకలకు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని రాచకొండ సీపీ మహేష్ భగవత్ స్పష్టం చేశారు. 31న రాత్రి 8 గంటల నుండి ఒంటి గంట వరకు మాత్రమే వేడుకలు జరుపుకోవాలని సూచించారు. అలాగే ఈవెంట్స్ ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా పోలీసుల నుంచి రాతపూర్వకంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అలాగే ఆ కార్యక్రమంలో ఎంతమంది పాల్గొంటారనే సమాచారం కూడా ముందే ఇవ్వాలని తెలిపారు.
ఇక సైబరాబాద్ శివారు ప్రాంతాల్లోని ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టనున్నట్లు చెప్పారు. అలాగే సాధారణ ప్రజానీకానికి ఇబ్బందులు కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని మహేష్ భగవత్ హెచ్చరించారు. మరోవైపు రాత్రి 11 నుంచి ఉదయం ఐదింటి దాకా ఔటర్ రింగ్‌రోడ్డుతో పాటు అన్ని ఫ్లైఓవర్లతో పాటు, పీవీ ఎక్స్ ప్రెస్ హైవే కూడా రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల దాకా మూతపడనున్నాయి.
న్యూఇయర్ సందర్భంగా నిర్వహించే వినోద కార్యక్రమాల నిర్వాహకులు కచ్చితంగా వినోదపన్ను కట్టాల్సిందేనని వాణిజ్య పన్నుల శాఖ తేల్చి చెప్పింది. చట్టంలో 20% పన్ను విధించే వెసులుబాటు ఉన్నప్పటికీ చాలా సందర్భాల్లో దీన్ని చెల్లించడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ఈసారి మాత్రం అంత మేర పన్ను కట్టాల్సిందేనని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీన్ని విస్మరించిన నిర్వాహకుల పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సందేహాల నివృత్తి కోసం కార్యక్రమ నిర్వాహకులు టోల్ ఫ్రీ నంబర్ 18004253787ను సంప్రదించవచ్చని తెలిపారు.