
మాయగాడు మధు రివర్స్ ఇంటరాగేషన్ !
సాధారణంగా తమ కస్టడీలోకి తీసుకున్న నిందితుల్ని పోలీసులు ప్రశ్నిస్తారు. ఇది రొటీన్‌గా జరిగే వ్యవహారమే.
పోలీసులకే ఎదురు ప్రశ్నలు వేస్తున్న మహామాయగాడు మధు
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా తమ కస్టడీలోకి తీసుకున్న నిందితుల్ని పోలీసులు ప్రశ్నిస్తారు. ఇది రొటీన్‌గా జరిగే వ్యవహారమే. అయితే నగరంలో వేల మంది యువతులకు వల వేసి, వందల మందిని వంచించిన మహా మాయగాడు మధు విషయంలో భిన్నంగా ఉంది. నిందితుడే పోలీసు అధికారులకు ఎదురు ప్రశ్నలు వేస్తున్నాడు. న్యాయస్థానం అనుమతితో అతడిని కస్టడీలోకి తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు వరుసగా మూడో రోజైన శుక్రవారమూ విచారించారు.
ఈ నేపథ్యంలోనే మధు నుంచి వీరికి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. ఓపక్క ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ముసుగులో, బంగారు భవితకు అవసరమైన సలహాలు ఇస్తానంటూ అనేక మంది యువతుల్ని వంచించినట్లు అంగీకరిస్తున్నాడు. మరోపక్క ‘నేను ఎవరినీ మోసం చేయలేదు. బలవంతంగా అత్యాచారమూ జరపలేదు. అలాంటప్పుడు ఏం తప్పు చేసినట్లు సార్?’ అంటూ తిరిగి ప్రశ్నిస్తున్నాడు. మధు చేతిలో వంచనకు గురైనట్లు అనుమానిస్తున్న బాధితులను సంప్రదించడానికి సీసీఎస్ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించట్లేదు. అతడి నుంచి స్వాధీనం చేసుకున్న రిజిస్టర్లలో ‘ఓవర్’, ‘డేంజర్’, ‘వేస్ట్’ అంటూ రిమార్క్స్ ఉన్న వారిని గుర్తించి, ఫిర్యాదులు తీసుకునేందుకు అధికారులు ముమ్మరంగా యత్నిస్తున్నారు. అయితే వీటిలో కొన్ని ఫోన్లు పని చేయకపోవడమో, మరికొన్నింటి నుంచి సరైన స్పందన లేకపోవడమో జరుగుతోంది. నిందితుడిపై మరింత పకడ్బందీ చర్యలు తీసుకోవడానికి బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని, వారి వివరాలు పూర్తి గోప్యంగా ఉంచుతామని సీసీఎస్ పోలీసులు చెప్తున్నారు.