
మంత్రి దత్తాత్రేయ సెల్‌ఫోన్‌ను కొట్టేశారు!
చిక్కడపల్లి (హైదరాబాద్): కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ సెల్‌ఫోన్‌ను ఆగంతకులు ఎవరో కొట్టేశారు. మంత్రి దత్తాత్రేయ రామ్‌నగర్‌లోని మీ సేవా కేంద్రం సమీపంలో నివాసం ఉంటారు. శనివారం అర్ధరాత్రి వీచిన గాలులకు చెట్లు విరిగి పడిపోవడంతో ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో దత్తాత్రేయ శామ్‌సంగ్ సెల్‌ఫోన్‌లో చార్జింగ్ అయిపోయింది. ఆదివారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఆయన ఇంటి ముందున్న గదిలో చార్జింగ్ పెట్టారు. బయట సందర్శకులు చాలా మంది వచ్చి ఉన్నారు.
కొద్దిసేపటి తర్వాత చూస్తే సెల్‌ఫోన్ కనిపించలేదు. దీంతో మంత్రి పీఏ యుగేందర్ ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చోరీకి గురైన సెల్‌ఫోన్ విలువ సుమారు రూ.25వేల వరకు ఉంటుందని అంచనా.