అయోమయం..ఆందోళన | Rotate the merger of the people in the villages | Sakshi
Sakshi News home page

అయోమయం..ఆందోళన

Published Fri, Sep 27 2013 2:46 AM | Last Updated on Fri, Sep 1 2017 11:04 PM

Rotate the merger of the people in the villages

సాక్షి, సిటీబ్యూరో: ఒక్క హడావుడి నిర్ణయం.. అయోమయానికి, ఆందోళనకు దారి తీసింది. ప్రజల మనోభీష్టానికి వ్యతిరేకంగా హడావుడిగా జీహెచ్‌ఎంసీలో విలీనం.. ‘అభివృద్ధి’తో ఆకట్టుకోవాలనుకున్న అధికారుల ఆత్రుతకు మేయర్ కళ్లెం.. విలీనమైన 35 పంచాయతీల్లో కొన్ని గ్రామాల విలీనాన్ని రద్దు చేస్తూ తాజాగా కోర్టు స్టే.. వరుస పరిణామాల నేపథ్యంలో ఇటీవల గ్రేటర్‌లో విలీనమైన గ్రామాల ప్రజల్లో అయోమయం నెలకొంది. ఆయా గ్రామాల్లో ఎలాంటి పనులు జరుగక జనం ఇబ్బందులు పడుతున్నారు.

ప్రజల అభిప్రాయాల్ని, జీహెచ్‌ఎంసీ పాలక మండలి తీర్మానాన్ని తోసిరాజని శివార్లలోని 35 గ్రామపంచాయతీలను ప్రభుత్వం ఇటీవల జీహెచ్‌ఎంసీలో విలీనం చేయడం తెలిసిందే. విలీన జీవోలు వెలువడ్డాయో లేదో.. అధికార యంత్రాంగం ఆయా గ్రామాలపై పడి, ప్రజల ఆందోళనలను పట్టించుకోకుండా రికార్డుల్ని స్వాధీనం చేసుకుంది. వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి, ప్రజా వ్యతిరేకతను పారదోలాలని భావించినా.. చివరకు చుక్కెదురైంది.

నిధుల విడుదలకు బ్రేక్..

కౌన్సిల్ తీర్మానాన్ని సైతం తుంగలో తొక్కి ప్రభుత్వం విలీన ప్రక్రియను పూర్తి చేయడాన్ని జీర్ణించుకోలేని పాలకమండలి.. తమ ఆమోదం లేని గ్రామాల్లో తమ నిధులతో అభివృద్ధి పనులు చేయరాదని నిర్ణయించింది. జీహెచ్‌ఎంసీ నిధులతో విలీన గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేయరాదని ఇటీవల జరిగిన జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశంలో మేయర్ మాజిద్ కమిషనర్ కృష్ణబాబుకు సూచించారు. తనకున్న అధికారంతో మేయర్  నిధుల విడుదలకు బ్రేక్ వేశారు. దీంతో ఏం చేయాలో అధికారులకు పాలుపోని పరిస్థితి నెలకొంది.
 
గ్రామాల్లో ఇబ్బందులు..

 తాజా పరిణామాల నేపథ్యంలో విలీన గ్రామాల్లో పనులు నిలిచిపోయాయి. దాంతో ఎక్కడి సమస్యలు అక్కడే తిష్టవేశాయి. జీహెచ్‌ఎంసీలో విలీనమైనప్పటికీ, పంచాయతీ సిబ్బందిని అక్కడే ఉంచారు. పంచాయతీల్లో ప్రస్తుతమున్న సామాగ్రి, సిబ్బందితోనే పనులు చేయాలని అధికారులు సూచించారు. సిబ్బంది ఉన్నా.. విద్యుద్దీపాలు, పారిశుద్ధ్యం, తదితర పనుల నిర్వహణకు అవసరమైన నిధుల్లేవు. అత్యవసర నిధుల కింద ఒక్కో గ్రామానికి రూ.5 లక్షల వంతున మంజూరు చేయనున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రకటించినా విడుదల కాలేదు. ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఎవరివ్వాలో తెలియక అవి ఆగిపోయాయి. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలదీ అదే పరిస్థితి. పంచాయతీల్లో పని చేస్తున్న సిబ్బందికి పంచాయతీరాజ్ శాఖ జీతాలు నిలిపివేసింది. దాంతో, గత నెల జీతాలందలేదు. ఈ నెల సైతం వస్తాయో, రాదో తెలియని పరిస్థితి నెలకొంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement