
రిషితేశ్వరి కుటుంబానికి 10 లక్షలు, స్థలం
గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయంలోని ఆర్కిటెక్చర్ కాలేజిలో చదువుతూ సీనియర్ల ర్యాగింగ్, ప్రిన్సిపల్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న రిషితేశ్వరి కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది. విజయవాడలో శుక్రవారం సుదీర్ఘంగా జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
దాంతో పాటు ఆ కుటుంబానికి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో 500 చదరపు గజాల స్థలం కూడా ఇవ్వాలని కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. తమ కుమార్తెకు న్యాయం చేయాలని, ప్రిన్సిపల్ సహా ఆమె ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రిషితేశ్వరి తల్లిదండ్రులు కోరుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో మంత్రివర్గం నుంచి ఇలా తాయిలాలు ఇస్తూ నిర్ణయం వెలువడటం గమనార్హం.