ర్యాగింగ్, లైంగిక వేధింపులే చంపేశాయి | Risiteswari killed by ranging and sexual harrassments | Sakshi
Sakshi News home page

ర్యాగింగ్, లైంగిక వేధింపులే చంపేశాయి

Published Mon, Aug 10 2015 2:02 AM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

ర్యాగింగ్, లైంగిక వేధింపులే చంపేశాయి - Sakshi

ర్యాగింగ్, లైంగిక వేధింపులే చంపేశాయి

* రిషితేశ్వరి ఆత్మహత్యపై బాలసుబ్రహ్మణ్యం కమిటీ నివేదిక
* ప్రిన్సిపల్ అండతోనే వర్సిటీలో అరాచకాలు, మద్యం
* ప్రిన్సిపల్ ర్యాగింగ్‌ను ప్రోత్సహించాడు
* అతడిని నిందితుడిగా చేరుస్తూ కేసు నమోదు చేయాలి
* విచారణకు ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి

 
సాక్షి, విశాఖపట్నం/ హైదరాబాద్: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో చోటుచేసుకున్న అమానవీయ సంఘటనల ఫలితంగా తీవ్ర అవమాన భారంతో ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యకు పాల్పడిందని ఏపీ ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ వెల్లడించింది. రిటైర్డ్ ఐఏఎస్ బాలసుబ్రహ్మణ్యం నేతృత్వంలో ఏర్పాటైన విచారణ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన సంగతి తెలిసిందే. ఆ నివేదికలోని వివరాలను ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదివారం విశాఖపట్నంలో మీడియాకు వెల్లడించారు.

రిషితేశ్వరి ఆత్మహత్యకు ఆర్కిటెక్చర్ కాలేజీ ప్రిన్సిపాల్ బాబూరావు కూడా కారణమని కమిటీ నివేదికలో స్పష్టం చేసింది. ఆయన అండదండలతో వర్సిటీలో అరాచకాలు యథేచ్ఛగా సాగుతున్నట్లు నివేదికలో వివరించింది. కాలేజీలోనే అమ్మాయిలు, అబ్బాయిలు కలసి మందుపార్టీలు చేసుకుంటున్నారని పేర్కొంది. ప్రిన్సిపాల్ ప్రవర్తన  సరిగా లేదని, ఆయనఅండతో కాలేజీలో మద్యం ప్రవహిస్తోందని వివరిం చింది. రిషితేశ్వరిని లై ంగిక వేధింపులకు గురి చేశారని, రిషితేశ్వరి ఫొటోలు తీసి ప్రచారం చేశారని, ఇవన్నీ ప్రిన్సిపాల్ అండతోనే సాగాయని తెలిపింది. ర్యాగింగ్, లైంగిక వేధింపులతో రిషితేశ్వరి మానసికంగా కుంగిపోయిందని, అవే కారణాలు ఆమె ఆత్మహత్యకు దారితీశాయని వివరించింది.
 
రిషితేశ్వరి అమాయకురాలని స్పష్టం చేసింది. ప్రిన్సిపాల్ బాబూరావుపై నిందితుడిగా కేసు నమోదు చేయాలని సూచించింది. ఈ కేసు విచారణకు ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని, విచారణ కోసం ప్రత్యేకంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను నియమించాలని సూచించింది. మళ్లీ ర్యాగింగ్ జరగకుండా ఉండేలా రిషితేశ్వరి ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని సిఫార్సు చేసింది. ర్యాగింగ్‌పై నిర్భయ చట్టం కన్నా గట్టి చట్టం తీసుకురావాలని నివేదికలో సూచించింది. నాగార్జున వర్సిటీలో ఏ నిబంధనలూ పాటించడం లేదని పేర్కొంది. మహిళా హాస్టల్‌కు పర్మనెంట్ వార్డెన్‌ను నియమించాలని సూచించింది.
 
 ఏఎన్‌యూ ఇన్‌చార్జి వీసీగా ఉదయలక్ష్మి నియామకం
 ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌యూ)కి ఇన్‌చార్జి వైస్‌చాన్స్‌లర్‌గా రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ ఉదయలక్ష్మిని నియమించారు. అలాగే ఈ ఘటనకు ప్రధాన బాధ్యుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపాల్ బాబూరావును సర్వీసు నుంచి డిస్మిస్ చేసినట్లు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు.
 
 ర్యాగింగ్ నిరోధానికి టోల్‌ఫ్రీ నంబర్..
 ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనతో వర్సిటీల్లోని పరిస్థితులపై అధ్యయనం చేసి వైఎస్సార్‌సీపీ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. విద్యార్థుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది. ఏపీలోని యూనివర్సిటీల్లో, కాలేజీల్లో లేదా మరెక్కడైనా ర్యాగింగ్ లేదా వేధింపులు చోటుచేసుకున్నా టోల్ ఫ్రీ నంబరు 1800-425-5314కు ఫోన్ చేయాలని మంత్రి గంటా సూచించారు. తద్వారా పోలీసులు తక్షణమే స్పందించి బాధితులకు రక్షణ కల్పించడానికి అవకాశం ఉంటుందని వివరించారు.  
 
కమిటీ చేసిన ఇతర ప్రధాన సూచనలు
* వర్సిటీ భద్రతపై ఆర్నెల్లకోసారి సమీక్షించాలి.
* క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉన్న విద్యార్థులను వర్సిటీలోకి అనుమతించవద్దు.
* ఫ్రెషర్స్ డేలను క్యాంపస్‌లోనే నిర్వహించాలి.
* క్యాంపస్‌లో మద్యపానం, ధూమపానం నిషేధించాలి.
* ర్యాగింగ్ నిరోధ చట్టాన్ని పక్కాగా అమలుచేయాలి.
* ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించేలా అవగాహన శిబిరాలు నిర్వహించేందుకు సైకాలజిస్టులతో కమిటీ ఏర్పాటు చేయాలి.
* అన్ని వర్సిటీల్లో పూర్తి వీసీలను నియమించాలి.
* ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులు భవిష్యత్తులో మరెలాంటి కోర్సులు చదవకుండా శాశ్వతంగా డీబార్ చేయాలి.  
* యూనివర్సిటీల్లో పోలీసు ఔట్‌పోస్టులు ఏర్పాటు చేయాలి
* హాస్టళ్లు, మెస్‌లు, లైబ్రరీల పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement