
రిషితేశ్వరిది ప్రభుత్వ హత్య
* అసెంబ్లీలో వైఎస్సార్‌సీపీ సభ్యురాలు రోజా మండిపాటు
* ప్రతిపక్షం శవరాజకీయాలు చేస్తోందని టీడీపీ ఎదురుదాడి
సాక్షి, హైదరాబాద్: నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరిది ప్రభుత్వ హత్యేనని శాసనసభలో బుధవారం విపక్ష వైఎస్సార్‌సీపీ సభ్యులు నిప్పులు చెరిగారు. ర్యాగింగ్ భూతాన్ని నియంత్రించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందడంతో విద్యార్థులు ఆత్మహత్యలను పాల్పడ్డారని ధ్వజమెత్తారు.
రిషితేశ్వరి ఆత్మహత్యపై వైఎస్సార్‌సీపీ సభ్యులు రోజా, ఉప్పులేటి కల్పన, భూమా అఖిలప్రియ, గిడ్డి ఈశ్వరి, చరితారెడ్డి, కళావతి అడిగిన ప్రశ్నపై సభలో వాడివేడిగా చర్చ జరిగింది. బాలసుబ్రహ్మణ్యం కమిటీ విద్యార్థులను విచారించ లేదని టీడీపీ సభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర చెప్పగా, 87 మంది విద్యార్థులను విచారించిందని హోం మంత్రి చినరాజప్ప, 177 మందిని విచారించిందని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పొంతనలేని వివరాలు చెప్పారు.
ప్రశ్న అడిగిన రోజాకు ఈ అంశంపై మొదట మాట్లాడే అవకాశం లభించింది. ర్యాగింగ్, లైంగిక వేధింపుల వల్లే రిషితేశ్వరి చనిపోయిందని చెప్పారు. ఈ వ్యవహారంలో ముగ్గురిని మాత్రమే అరెస్టు చేసి ప్రభుత్వం చేతులు దులిపేసుకుందని విమర్శించారు. రిషితేశ్వరి చావుకు ప్రిన్సిపల్ బాబురావే కారణమని బాలసుబ్రహ్మణ్యం కమిటీ స్పష్టంగా చెప్పిందని గుర్తుచేశారు. అయినా ప్రిన్సిపల్‌ను ప్రభుత్వ పెద్దలు రక్షిస్తున్నారని అన్నారు. ర్యాగింగ్ నిరోధానికి సుప్రీంకోర్టు విడుదల చేసిన మార్గదర్శకాలను ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని రోజా డిమాండ్ చేశారు.
రిషితేశ్వరి ఆత్మహత్య తర్వాత మంత్రులకు యూనివర్సిటీని సందర్శించే సమయం లేకుండా పోయిందన్నారు. స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కూడా యూనివర్సిటీకి రాలేదన్నారు. మంత్రి గంటా అవమానకరంగా మాట్లాడుతున్నారని, ప్రిన్సిపల్ తప్పున్నట్టుగా కమిటీ చెప్పలేదనడాన్ని రోజా తప్పుబట్టారు. ఉప్పులేటి కల్పన మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 15 మంది విద్యార్థులు చనిపోతే, అందులో 11 మంది నారాయణ కాలేజీల్లోనే మరణించారని చెప్పారు.ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ.. విపక్షం శవ రాజకీయాలు చేస్తోందని ఎదురుదాడికి దిగారు.
ప్రిన్సిపల్ పాత్ర తేలితే చర్యలు: హోం మంత్రి
రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనలో ప్రిన్సిపల్ పాత్ర ఉందని తేలితే చర్యలు తీసుకోవడానికి వెనకాడమని హోంమంత్రి చినరాజప్ప చెప్పారు.
ర్యాగింగ్ కమిటీలు లేకపోవడం వాస్తవమే: గంటా
విశ్వవిద్యాలయాల్లో ర్యాగింగ్ నిరోధక కమిటీలు లేని మాట వాస్తవమేనని మంత్రి గంటా శ్రీనివాసరావు అంగీకరించారు. ర్యాగింగ్ నిరోధానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ర్యాగింగ్ అనే పదాన్ని ఉచ్ఛరించడానికైనా భయపడేలా చర్యలు ఉంటాయన్నారు.
మంత్రి గంటా సభను తప్పుదోవ పట్టిస్తున్నారు
నాగార్జున యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న రిషితేశ్వరి ఆత్మ ఘోషించేలా అధికార పక్ష సభ్యులు శాసనసభలో వ్యవహరించారని వైఎస్సార్ సీపీ మహిళా ఎమ్మెల్యేలు మండిపడ్డారు. పార్టీ ఎమ్మెల్యే రోజా.. ఇతర సభ్యులు గౌరు చరిత, గిడ్డి ఈశ్వరితో కలిసి బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడారు. శాసనసభను తప్పుదోవ పట్టించే విధంగా మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యవహరించడం దారుణమన్నారు.
ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపల్ బాబూరావును కేసు నుంచి తప్పించే విధంగా ప్రభుత్వ చర్యలున్నాయని విమర్శించారు. ప్రిన్సిపల్‌ను కేసు నుంచి తప్పిస్తే తమకు అన్యాయం చేసినట్లేనని రిషితేశ్వరి తండ్రి ఆవేదన చెందుతుంటే... ప్రభుత్వాన్ని అభినందించారని మంత్రి గంటా సభలో నిస్సిగ్గుగా చెప్పుకోవడం దారుణమన్నారు. వియ్యంకుడైన మంత్రి నారాయణ కళాశాలలో విద్యార్థినుల ఆత్మహత్యలపై మంత్రి గంటా నోరు విప్పడం లేదని ధ్వజమెత్తారు.