
సాగర మథనం
హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనకు ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో... అందులోని నీటిని పూర్తిగా ఖాళీ చేసేందుకు ఎంత సమయం పడుతుంది..?
హుస్సేన్‌సాగర్... చారిత్రక భాగ్యనగరి మెడలో కంఠాభరణం. గ్రేటర్‌లోని పర్యాటక ప్రదేశాలలో మకుటాయమానం. ఆబాలగోపాలాన్ని అలరించే అందమైన జలాశయం. ఆ అందాలను ద్విగుణీకృతం చేయాలని.. సాగర్‌ను వేధిస్తున్న కాలుష్య భూతాన్ని తరిమి... మురుగునీటికి దూరంగా... స్వచ్ఛమైన జలాలతో అలరారేలా చేయాలనే భగీరథ ప్రయత్నానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఈ జలాశయంలోని కలుషిత నీటిని పూర్తిగా బయటకు తరలించి...స్వచ్ఛమైన వాన నీటితో నింపేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది? సాగర మథనానికి సిద్ధమవుతున్న అధికారుల వ్యూహమేంటి? సాగర్‌లోని నీటినంతటినీ బయటకు పంపేదెలా? అదీ ఏ వర్గానికీ ఇబ్బంది కలుగకుండా... ఇప్పుడిదే సర్వత్రా చర్చనీయాంశం.
* సాగర్ ప్రక్షాళనకు ముమ్మర సన్నాహాలు
* స్వచ్ఛమైన జలాశయంగా మలిచేందుకు యత్నాలు
* నీటి మళ్లింపుపై కసరత్తు
* వేసవిలోగా ఖాళీ చేసేందుకు ప్రణాళిక
సాక్షి, సిటీబ్యూరో: హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనకు ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో... అందులోని నీటిని పూర్తిగా ఖాళీ చేసేందుకు ఎంత సమయం పడుతుంది..? రానున్న వేసవిలోగా సాగర్ నీటిని దిగువకు విడుదల చేయాలంటే ఏం చేయాలి? అనే అంశాలపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. వారమో... నెల రోజుల్లోనో సాగర్ నీటిని ఖాళీ చేయడం సాధ్యం కాదని.. ఒకవేళ అందుకు సిద్ధమైతే ఇతరత్రా ఇబ్బందులు ఎదురవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న అధికారులు డిసెంబర్ రెండో వారం నుంచి నీటి విడుదలకు చర్యలు చేపడితే... వేసవిలోగా పూర్తిగా తరలించవచ్చునని అంచనా వేస్తున్నారు.
నీటిని ఎటు మళ్లించాలి? పేరుకుపోయిన మడ్డి డ్రెడ్జింగ్‌కు ఎంత సమయం పడుతుంది? విషతుల్య రసాయన పదార్థాల తొలగింపునకు ప్రత్యేక చర్యలు అవసరమవుతాయా? అనంతరం పూర్తిగా శుద్ధి చేసేందుకు ఎంత సమయం పడుతుంది? అందుకు ఆచరించాల్సిన విధి విధానాలేమిటి? అనే అంశాలపై వివిధ విభాగాల అధికారులు చర్చలు జరుపుతున్నారు. చర్చలు ఒక కొలిక్కి వచ్చాక కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నారు.
వర్షం నీటి తో నింపాలని...
టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే హుస్సేన్‌సాగర్.. దాని పరిసరాలపై ప్రత్యేక శ్రద్ధ కనబరచడం తెలిసిందే. కాలుష్యకాసారంగా మారిన సాగర్ ప్రక్షాళనతో పాటు ..చుట్టూ ఆకాశహర్మ్యాలను నిర్మిస్తామని.. సాగర్ ప్రక్షాళనకు రూ.100 కోట్లు ఖర్చు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో రానున్న ఏప్రిల్- మే నెలల్లోగా సాగర్ ను ఖాళీ చేసేందుకు తమవైపు నుంచి చేయాల్సిన పనులేమిటని అధికారులు ప్రణాళికల రూపకల్పనకు సిద్ధమవుతున్నారు.
ఇవి ఒక రూపు సంతరించుకున్నాక సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకు వెళ్లనున్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నీటిని శుద్ధి చేశాక ఇతర ప్రాంతాల నుంచి కలుషిత, వ్యర్థజలాలు సాగర్‌లో కలువకుండా పటిష్ట చర్యలు తీసుకోనున్నారు. మురుగునీటి తరలింపునకు ప్రత్యేక డైవర్షన్ లైన్లు ఏర్పాటు చేస్తారు. ఖాళీ అయ్యాక వర్షం నీటితోనే సాగర్ నిండాలనేది యోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు ఎంత సమయం పట్టవచ్చనే అంశమై అధికారులు అధ్యయనం చేస్తున్నారు.