ఆర్థిక నేరం అత్యంత ప్రమాదకరమైందని, కుటుంబాల ఉసురు తీస్తాయని ఉమ్మడి హైకోర్టు పేర్కొంది.
అగ్రిగోల్డ్ కేసులో నిగ్గుదేల్చిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక నేరం అత్యంత ప్రమాదకరమైందని, కుటుంబాల ఉసురు తీస్తాయని ఉమ్మడి హైకోర్టు పేర్కొంది. అగ్రిగోల్డ్ యాజమాన్యం దాదాపు రూ.600 కోట్లను తన అనుబంధ కంపెనీలకు బదలాయించిందనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని తెలిపింది. దురుద్దేశపూర్వకంగా, నిబంధనలకు విరుద్ధంగా ఈ మళ్లింపు జరిగిందని తేల్చింది. అగ్రిగోల్డ్ యాజమాన్యానికి డిపాజిట్ల రూపంలో రూ.కోట్లు చెల్లించిన మధ్య, దిగువ తరగతి ప్రజలు అనుభవిస్తున్న క్షోభను న్యాయస్థానాలు విస్మరించబోవని స్పష్టం చేసింది. కార్పొరేట్ చట్టాలను అడ్డం పెట్టుకుని అమాయకుల నుంచి డబ్బు వసూలు చేసిన వ్యక్తులు.. సీఆర్‌పీసీ సెక్షన్ 438(బెయిల్) కింద రక్షణ పొందుదామనుకుంటే అది కుదరని తేల్చిచెప్పింది.
ఇలాంటి కేసుల్లో నేరం జరిగిన తీరు తెన్నులు తెలుసుకునేందుకు నిందితుడిని విచారించడం తప్పనిసరని స్పష్టం చేసింది. ఈ కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకుని అగ్రిగోల్డ్, దాని అనుబంధ కంపెనీలకు డైరెక్టర్‌గా, వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఎం.బానోజీరావుకు ముందస్తు బెయిల్ నిరాకరిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తాళ్లూరి సునీల్ చౌదరి ఇటీవల తీర్పు వెలువరించారు. ఏపీ, తెలంగాణలో నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ బానోజీరావు హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిని జస్టిస్ సునీల్ చౌదరి ఇటీవల విచారించారు.