గ్రేటర్ ఆర్టీసీకీ నిధుల వెల్లువ | RTC The key to greater inflows of funds | Sakshi
Sakshi News home page

గ్రేటర్ ఆర్టీసీకీ నిధుల వెల్లువ

Published Fri, Jun 17 2016 11:56 PM | Last Updated on Tue, Aug 21 2018 12:12 PM

గ్రేటర్ ఆర్టీసీకీ నిధుల వెల్లువ - Sakshi

గ్రేటర్ ఆర్టీసీకీ నిధుల వెల్లువ

రూ.198 కోట్లు చెల్లించిన జీహెచ్‌ఎంసీ
ఇక నుంచి నష్టాలన్నీ  జీహెచ్‌ఎంసీయే భరిస్తుంది
నగరంలో అదనపు బస్‌స్టేషన్‌లు,  వాణిజ్యకేంద్రాల ఏర్పాటు
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు  30 ఓల్వో బస్సులు
సీఎం సమీక్షతో నగర ఆర్టీసీకి ఊరట

 

సిటీబ్యూరో గ్రేటర్ ఆర్టీసీకి గొప్ప ఊరట. నగరంలో  బస్సుల నిర్వహణపై ఇక నుంచి పూర్తిగా జీహెచ్‌ఎంసీయే బాధ్యతవహించనుంది. శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మేరకు స్పష్టం చేశారు.  అంతేకాదు...ఇప్పటి వరకు నమోదైన సుమారు రూ.338 కోట్లకు పైగా నష్టాల్లో రూ.198 కోట్ల నిధులను జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి చెక్కు రూపంలో ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణకు అందజేశారు. దీంతో పీకల్లోతు నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న నగర ఆర్టీసీకి ఊరట లభించినట్లయింది. మరోవైపు  నగరంలో  ప్రజారవాణాను బలోపేతం చేసే చర్యల్లో భాగంగా ఆర్టీసీ ఎదుర్కొనే నష్టాలన్నింటినీ జీహెచ్‌ఎంసీయే  భరించనుంది. టిక్కెట్టేతర ఆదాయంపైన దృష్టి సారించాలని, నగరంలో ప్రజల అవసరాలకు తగినవిధంగా బస్సులను పెంచాలని  సమీక్షా సమావేశంలో  సీఎం దిశానిర్ధేశం చేశారు. నగరంలోని 28 డిపోల ద్వారా ప్రతి రోజు సుమారు 3550 బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. 33 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటున్నారు. బస్సుల నిర్వహణ, విడిభాగాలు, ఇంధనం కొనుగోళ్లు, ఉద్యోగుల జీతభత్యాలు తదితర ఖర్చుల వల్ల ఏటేటా నష్టాలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రతి రోజు  రూ.2.5 కోట్ల ఆదాయం లభిస్తుండగా, బస్సుల నిర్వహణ కోసం రూ.3.5 కోట్ల మేర ఖర్చు చేయవలసి వస్తోంది. దీంతో రోజుకు రూ.కోటి మేర నష్టం వాటిల్లుతోంది. గ్రేటర్ ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించేందుకు జీహెచ్‌ఎంసీ గత సంవత్సరం రూ.100 కోట్ల మేర అందజే సింది. తాజాగా రూ.198 కోట్ల  నిధులను  విడుదల చేసింది. ఇక నుంచి నమోదయ్యే ప్రతి రూపాయి నష్టాన్ని సైతం జీహెచ్‌ంసీయే భరించనుంది. అర్బన్ ట్రాన్స్‌పోర్టేషన్‌లో భాగంగా ఈ నిధులను వెచ్చించనుంది.

 
అదనపు బస్‌స్టేషన్‌లు, వాణిజ్య కేంద్రాలు...

ప్రయాణికుల రద్దీ, ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడున్న మహాత్మాగాంధీ, జూబ్లీబస్‌స్టేషన్‌లకు తోడు మరో రెండు బస్‌స్టేషన్‌లను కొత్తగా నిర్మించాలని సీఎం సూచించారు. బస్‌స్టేషన్‌లు, బస్సుల్లో వ్యాపార  ప్రకటనల ద్వారా అదనపు ఆదాయాన్ని సముపార్జించుకోవాలి. అలాగే నగరం నడిబొడ్డున ఉన్న రాణిగంజ్, కంటోన్మెంట్ డిపోలను షాపింగ్‌మాల్స్, కమర్షియల్ కాంప్లెక్స్‌లుగా అభివృద్ధి చేయాలని, ప్రస్తుతం అక్కడ ఉన్న డిపోలను శివార్లకు తరలించాలని  నిర్ణయించారు. టిక్కెట్‌లపైనే కాకుండా టిక్కెట్టేతర ఆదాయంపైన ప్రధానంగా దృష్టి సారించాలని సీఎం పేర్కొన్నారు. మరోవైపు విద్యార్థులు, వికలాంగులు, జర్నలిస్టులు, ఉద్యోగులు తదితర వర్గాలకు అందజేసే రాయితీ బస్‌పాస్‌లపైన ప్రభుత్వం చెల్లించవలసిన నిధులను ఇక నుంచి బడ్జెట్‌లోనే కేటాయించనున్నారు.

 
రూ.30 కోట్లతో ఎయిర్‌పోర్టుకు ఓల్వో బస్సులు...

ప్రస్తుతం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగిస్తున్న  25 పుష్పక్ బస్సుల స్థానంలో  సుమారు రూ.30 కోట్లతో అత్యాధునిక ఓల్వో బస్సులను  ప్రవేశపెట్టనున్నారు. విశ్వనగరం స్థాయి ప్రతిష్టకు అనుగుణంగా అత్యాధునిక బస్సులను  అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. ప్రస్తుతం జేఎన్‌టీయూ, సికింద్రాబాద్, జేబీఎస్, పర్యాటక భవన్‌ల నుంచి పుష్పక్ బస్సులు ఎయిర్‌పోర్టుకు రాకపోకలు సాగిస్తున్నాయి. అలాగే  ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా వివిధ మార్గాల్లో బస్సుల సంఖ్యను పెంచేందుకు మరో 160 కొత్త బస్సులను  కొనుగోలు చేసేందుకు సీఎం సుముఖత వ్యక్తం చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement