
సాయికిరణ్ తండ్రి శ్రీహరిగౌడ్‌ను ఓదారుస్తున్న స్పీకర్ మధుసూదనాచారి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ (ఇన్‌సెట్లో) సాయికిరణ్ మృతదేహం
హైదరాబాద్: అమెరికాలో దుండగుల కాల్పుల్లో మృతిచెందిన సాయికిరణ్ అంత్యక్రియలు ఆదివారం అశ్రునయనాల నడుమ ముగిసాయి. తల్లిదండ్రులు శ్రీహరిగౌడ్, రూపభవానీ, తమ్ముడు అవినాష్‌గౌడ్.. మృతదేహంపై పడి విలపించిన తీరు అందరిని కంటతడి పెట్టించింది. హైదరాబాద్‌లోని కుషాయిగూడకు చెందిన ఐలా సాయికిరణ్‌గౌడ్ అమెరికాలోని అట్లాంటా వర్సీటీలో ఎంఎస్ చదువుకోవడానికి వెళ్లి గత ఆదివారం నల్లజాతీయుల కాల్పుల్లో హత్యకు గురైన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో ఆశ్రునయనాల నడుమ సాయికిరణ్ అంతిమయాత్ర కొనసాగగా.. కుషాయిగూడ శాంతివనంలో తండ్రి శ్రీహరి అంత్యక్రియలు నిర్వహించారు.
తెల్లవారుజామున 4 గంటలకు..: అమెరికా నుంచి గురువారం కార్గ్ ప్రత్యేక విమానంలో తరలించిన సాయికిరణ్‌గౌడ్ మృతదేహం శనివారం రాత్రి 12 గంటల సమయంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. అక్కడ అధికారిక కార్యక్రమాలు పూర్తయిన అనంతరం ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో కుషాయిగూడ, సుబ్రమణ్యనగర్‌లోని మృతుని ఇంటికి చేరుకుంది.
నివాళులర్పించిన స్పీకర్, మండలి చైర్మన్‌లు...
సాయికిరణ్‌గౌడ్ మృతదేహాన్ని ఆదివారం అసెంబ్లీ స్పీకర్ మధుసుదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్‌లు సందర్శించి నివాళ్లు ఆర్పించారు. వారివెంట మాజీమంత్రి రాజేశంగౌడ్ ఉన్నారు. కాగా మృతుడు సాయికిరణ్ మిత్రుడు మనోజ్ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు.