సాలార్జంగ్...ఓ గొప్ప కళాభిమాని
‘సాలార్జంగ్ 3’ మీర్ యూసుఫ్ అలీఖాన్ గొప్ప కళాభిమాని. అరుదైన వస్తువుల సేకరణ ఆయన హాబీ. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ వద్ద ప్రధానమంత్రిగా పనిచేశారు. దేశ, విదేశాలు పర్యటించి ఎన్నో గొప్ప కళాఖండాలను సేకరించారు. పెద్ద మ్యూజియం ఏర్పాటు చేయాలన్నది ఆయన జీవితాశయం. కళాఖండాల సేకరణ కోసం పెళ్లి కూడా చేసుకోకుండా బ్రహ్మచారిగానే ఉండిపోయారు.
1949 మార్చి 2న తుది శ్వాస విడిచారు. మరణాంతరం ఆయన నివాసం ఉన్న దివాన్‌దేవిడీలోనే ఒక మ్యూజియం ఏర్పాటు చేశారు. నూతన భవనాలు నిర్మించాక కళాఖండాల్ని అందులోకి తరలించారు. అదే ప్రస్తుత సాలార్జంగ్ మ్యూజియం. 43,000 కళాఖండాలు, 50 వేలకు పైగా అరుదైన పుస్తకాలు ఈ మ్యూజియం సొంతం. ప్రతి ఏటా 10 లక్షల నుంచి 15 లక్షల మంది దీనిని సందర్శిస్తుంటారు.