కేటీఆర్‌ కనుసన్నల్లోనే ఇసుక మాఫియా | Sand mafia in the eye of KTR says UTTAM | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌ కనుసన్నల్లోనే ఇసుక మాఫియా

Published Tue, Jul 25 2017 3:22 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

కేటీఆర్‌ కనుసన్నల్లోనే ఇసుక మాఫియా - Sakshi

కేటీఆర్‌ కనుసన్నల్లోనే ఇసుక మాఫియా

ఆయన మంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సిందే: ఉత్తమ్‌
- మాఫియాను కాపాడటానికే దళితులపై పోలీసులతో దాడులు
కేటీఆర్, కేసీఆర్‌ దళితులకు క్షమాపణ చెప్పాలి
ఈ అంశాన్ని వదిలిపెట్టబోం..
రేపు జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు
31న సిరిసిల్లలో నిరసన సభ నిర్వహిస్తామని వెల్లడి
టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో నిర్ణయాలు
 
సాక్షి, హైదరాబాద్‌: ఇసుక మాఫియాను కాపాడటానికే మంత్రి కె.తారకరామారావు దళితులపై పోలీసులతో దాడులు చేయించారని.. ఆయన వెంటనే మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. కేటీఆర్, కేసీఆర్‌ వెంటనే దళితులకు క్షమాపణ చెప్పాలన్నారు. సోమవారం ఉత్తమ్‌ అధ్యక్షతన గాంధీభవన్‌లో టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత కె.జానారెడ్డి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, టీపీసీసీ మాజీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య, సీనియర్‌ నేతలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, బలరాం నాయక్, పొన్నం ప్రభాకర్, ప్రసాద్‌కుమార్, కె.కె.మహేందర్‌రెడ్డి, మల్లు రవి, ఆరెపల్లి మోహన్‌లతోపాటు పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, డీసీసీల అధ్యక్షులు ఇందులో పాల్గొన్నారు.

సమావేశం అనంతరం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. పంటలకు మద్దతు ధర అడిగిన రైతులను చితకబాది, అక్రమకేసులు పెట్టి, చేతులకు బేడీలు వేసి కోర్టులకు తరలించిన పోలీసులు... ఇప్పుడు సిరిసిల్లలో దళితులపై అమానుషంగా దాడి చేసి, చిత్రహింసలకు గురిచేశారని విమర్శించారు. మంత్రి కేటీఆర్‌ బంధువులే ఇసుక మాఫియాను నడిపిస్తున్నారని, అదంతా కేటీఆర్‌ కనుసన్నల్లోనే నడుస్తోందని ఆయన ఆరోపించారు. ఆ వివరాలను త్వరలోనే బయటపెడతామని చెప్పారు. తెలంగాణ వస్తే జీవితాలు మారిపోతాయని, ఉద్యోగాలు వస్తాయని, ఉపాధి దొరుకుతుందనే ఆశతో దళితులు ఉద్యమంలో ముందుండి పోరాడారన్నారు. కానీ ఇసుక మాఫియా ఆగడాలను ప్రశ్నించినందుకు దళితులపై పోలీసులు అమానవీయంగా దాడులకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఎవరి అండ చూసుకుని, ఎవరి ఆదేశాలతో పోలీసులు ఇంత బరితెగించారో చెప్పాలని ఉత్తమ్‌ డిమాండ్‌ చేశారు.
 
వదిలిపెట్టబోం..
అమానుష ఘటనలు జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్‌ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. డీజీపీకి ఫిర్యాదు చేసి వారం రోజులవుతున్నా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని మండిపడ్డారు. దళితులపై దాడుల అంశాన్ని వదిలిపెట్టేది లేదని ఉత్తమ్‌ పేర్కొన్నారు. దళితులపై దాడులకు నిరసనగా ఈ నెల 26న అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపట్టనున్నట్టు చెప్పారు. దళితులు, బీసీలపై దాడులకు నిరసనగా ఈ నెల 31న సిరిసిల్లలో నిరసన సభ నిర్వహిస్తామన్నారు. దాడులకు కారణమైన మంత్రి కేటీఆర్‌ పదవి నుంచి తప్పుకోవాలని, సీఎం కేసీఆర్‌ దళితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. 
 
జానా x పొన్నాల
గరంగరంగా పీసీసీ భేటీ
- నక్సల్స్‌ను జానా వేటాడారన్న ఓ నేత
ఏం మాట్లాడుతున్నావంటూ జానా ఆగ్రహం
మెల్లగా మాట్లాడాలన్న పొన్నాల
సీనియర్‌ నేతలు కె.జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య మధ్య వాగ్వివాదానికి పీసీసీ విస్తృతస్థాయి భేటీ వేదికగా మారింది. భేటీలో ఓ నేత లేవనెత్తిన అంశంపై జానారెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయగా... మెల్లగా మాట్లాడాలని పొన్నాల అనడం వేడిని మరింత పెంచింది. వారిద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. సిరిసిల్ల నియోజకవర్గంలోని నేరెళ్లలో దళితులపై పోలీసు దాడులు, ఆ అంశంపై పార్టీ కార్యాచరణను చర్చించడానికి పీసీసీ భేటీ జరిగింది. ఇందులో వికలాంగుల కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ బక్కా జడ్సన్‌ మాట్లాడుతూ.. ‘‘జానారెడ్డి హోంమంత్రిగా ఉన్నప్పుడు నక్సలైట్లను వేటాడారు.

పోలీసులు ఊళ్లపై పడ్డారు. నక్సలైట్లకు ఆశ్రయం ఇచ్చినవారిని, సహకరించిన వారిని ఎప్పుడు తీసుకుపోతారో, ఏం చేస్తారో తెలియని పరిస్థితి ఉండేది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనూ అవే పరిస్థితులు ఉన్నాయి.’’అని వ్యాఖ్యానించారు. దీంతో జానారెడ్డి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను హోంమంత్రిగా ఉన్నప్పుడు నక్సల్స్‌ సమస్యను శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నించామని, మావోయిస్టులతో శాంతిచర్చలు జరిపామని పేర్కొన్నారు. నక్సలైట్లను వేటాడినట్టుగా ఎలా అంటున్నారని జడ్సన్‌ను నిలదీశారు. ఈ సమయంలో పొన్నాల లక్ష్మయ్య జోక్యం చేసుకుని.. ‘చర్చిస్తున్నప్పుడు నిదానంగా, సావధానంగా మాట్లాడుకోవాలి.

అంత కోపంగా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఓపికగా, మెల్లగా చెప్పండి..’’అని సూచించారు. దీంతో జానారెడ్డి మరింతగా ఆగ్రహిస్తూ.. ‘‘నక్సలైట్లను వేటాడామన్న వాళ్లకు మద్దతిస్తారా? దీనిపై ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నాం..’’అని పొన్నాలను నిలదీశారు. దీనికి పొన్నాల కూడా మరింత ఆవేశంగా సమాధానమిచ్చారు. కొద్దిసేపటికే మాటామాట పెరిగి.. వాగ్వివాదంగా మారింది. వెంటనే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి కల్పించుకుని.. వారిని సముదాయించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement