సర్దార్ సర్వాయి పాపన్న త్యాగమూర్తి
శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్
హైదరాబాద్: బహుజనవీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ మహరాజ్ అసమాన త్యాగమూర్తి అని శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ అన్నారు. పాపన్నగౌడ్ జయంతి వేడుకలను ఈ నెల 18న హైదరాబాద్ కిస్మత్‌పూర్‌లో వైభవోపేతంగా జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ గౌడ సంఘం ప్రధానకార్యదర్శి, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు వట్టికూటి రామారావుగౌడ్ అధ్యక్షతన ఆదివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్రారంభమైన పాపన్నగౌడ్ మహారాజ్ 366వ జయంతి వారోత్సవాలకు స్వామిగౌడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జై గౌడ ఉద్యమగీతాల సీడీని, సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ వీరోచిత సంక్షిప్తచరిత్ర(1650-1709) పుస్తకం, గడప గడపకు జైగౌడ్ ఉద్యమ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దక్కన్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన పాలకుల్లో సర్వాయి పాపన్నది రెండోస్థానమని కొనియాడారు. పాపన్న కేవలం గౌడ కులస్తుల హక్కుల కోసమే కాకుండా బహుజనులందరి అభ్యున్నతికి పాటుపడ్డారని పేర్కొన్నారు.
సర్వాయి పాపన్న గురించి మాట్లాడుకోవడమేకాకుండా, ఆయన నుంచి స్ఫూర్తిని కూడా పొందాలని అన్నారు. పాపన్న చరిత్ర గౌడ కులస్తులకే తెలియనప్పుడు ఆయన విగ్రహాన్ని గోల్కొండ కోటపై ఏర్పాటు చేయాలని, ట్యాంక్‌బండ్‌పై ప్రతిష్టించాలని ప్రభుత్వాన్ని ఎలా అడుగుతామని ప్రశ్నించారు. కులం పేరును రుబాబుగా తన పేరు చివరన పెట్టుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ కల్లుగీత కార్మికవృత్తిని కాపాడుకోవాలని, దీనిలో భాగంగా హరితహారంలో పెద్దఎత్తున ఈత, తాటి చెట్లను గ్రామగ్రామాన నాటాలని సూచించారు. తెలంగాణ గౌడ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌రావుగౌడ్ మాట్లాడుతూ గౌడ కులస్తులు రాజకీయంగా ముందుండాలని పిలుపునిచ్చారు. నిరుపేద గౌడ విద్యార్థుల కోసం హాస్టళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. సివిల్స్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఉచితంగా ఐఏఎస్, ఐపీఎస్ శిక్షణ సంస్థను నెలకొల్పనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో మనరూప రియల్ ఎస్టేట్స్ అధినేత మద్దెల రమేష్‌బాబుగౌడ్, తెలంగాణ గౌడ సంఘం గౌరవాధ్యక్షుడు బండి నర్సాగౌడ్, అధ్యక్షుడు ఈడ శేషగిరిరావు, ఉపాధ్యక్షులు కాశీనాథ్‌గౌడ్, గౌడ ప్రముఖులు రఘునందన్ గౌడ్, ఉపేందర్‌గౌడ్ పాల్గొన్నారు.