
సత్యవిజయం స్ఫూర్తిదాయకం
సాఫ్ట్‌వేర్ సామ్రాజ్యంపై భాగ్యనగర పతాకాన్ని ఎగురవేసిన సహచరుడి జ్ఞాపకాలతో స్నేహితులు మురిసిపోయారు. శిఖరంపై శిష్యుడ్ని చూసి గురువులు ఉబ్బితబ్బిబ్బయ్యారు. తన ఒడిలో అక్షరాలు నేర్చుకున్న విద్యార్థిని తలచుకుని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పరవశించిపోయింది. సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఎన్నికకావడంతో ఆయన సహచరులు, సంబంధీకులు అందరూ గర్వపడుతున్నారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.
హెచ్‌పీఎస్‌లో ప్రత్యేక అసెంబ్లీ..
అసాధారణ స్థాయిలో ఎదిగిన సత్య నాదెళ్లను అభినందిస్తూ బుధవారం ఉదయం బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో ‘ప్రత్యేక అసెంబ్లీ’ నిర్వహించారు. సత్యను అభినందిస్తూ ప్రత్యేక తీర్మానం చేశారు. తెలుగుజాతికే కాకుండా మెత్తం దేశానికే స్ఫూర్తిగా నిలిచిన సత్యను ఆదర్శంగా తీసుకుని ప్రతి విద్యార్థి తాము ఎంచుకున్న రంగాల్లో విజయం సాధించాలని ప్రిన్సిపల్ కల్నల్ ఆర్‌ఎస్ ఖత్రీ సూచించారు. ఈ కార్యక్రమంలో బోర్డు సెక్రటరీ ఫయాజ్‌ఖాన్, రిటైర్డ్ ప్రిన్సిపల్, సత్యకు పాఠాలు చెప్పిన జయానంద్ మాస్టర్, సత్య క్లాస్‌మేట్ ఫణి తదితరులు పాల్గొన్నారు.
అద్భుత విజయం..
సత్య నాదెళ్ల అద్భుతమైన విజయాన్ని సాధించారు. మొదటి నుంచి కార్యదక్షత ఉన్న మనిషి. మేమిద్దరం చిన్నప్పుడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో కలిసి చదువుకున్నాం. సత్య ఏడోతరగతి సెక్షన్ ‘ఎ’లో చేరగా, నేను ‘బి’ సెక్షన్‌లో ఉన్నా. ఆయన 1982లో టెన్త్ పాసయ్యారు. ఆయన భార్య అనుపమ కూడా ఇదే స్కూల్లో చదువుకున్నారు. సత్య మైక్రోసాఫ్ట్ కంపెనీకి సీఈఓగా నియమితులవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ఉపాధ్యాయుల బోధన, అక్కడ క్రమశిక్షణే ఈ విజయానికి కారణం.
- డాక్టర్ రఘురామ్, ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ డైరె క్టర్
టెక్నాలజీ అంటే ఆసక్తి..
నేను.. సత్య ఏడో తరగతి నుంచి ఇంటర్ వరకు క్లాస్‌మేట్స్. సత్యకు చిన్నప్పట్నుంచి టెక్నాలజీ అంటే చాలా మక్కువ. క్రికెట్ అంటే చాలా ఇష్టం. నేను కొద్ది నెలల క్రితం వరకు మైక్రోసాఫ్ట్ సంస్థలో అకడమిక్స్ డెరైక్టర్‌గా పనిచేశా. వృత్తిలో భాగంగా తరచూ కలిసే వాళ్లం.
- ఫణి
ఉత్తమ విద్యార్థి..
సత్య చక్కటి అవగాహన, లోతైన వ్యక్తిత్వం ఉన్న మనిషి. పాఠాలు శ్రద్ధగా వినేవాడు. అందరితో కలివిడిగా ఉండేవాడు. వాళ్లనాన్న ఐఏఎస్ అధికారిగా ఉన్నా సత్యకు ఎలాంటి గర్వం ఉండేది కాదు. క్రికెట్ బాగా ఆడేవాడు. ఉత్తమ విద్యార్థికి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఆయనలో ఉండేవి. నేను ఇష్టపడే విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదగడం చాలా ఆనందంగా ఉంది.
- జయానంద్, రిటైర్డ్ ప్రిన్సిపల్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్