
‘సేవ్ డెమొక్రసీ’ ఆందోళన 23కు మార్పు
సాక్షి, హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్ష ఎమ్మెల్యేల్ని ప్రలోభాలకు గురిచేసి కొనుగోలు చేస్తున్నందుకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 25న చేయ తలపెట్టిన ‘సేవ్ డెమొక్రసీ’ (ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి) ఆందోళన కార్యక్రమం తేదీని ఈ నెల 23కు మార్చినట్లు ఆ పార్టీ ప్రకటించింది. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అపాయింట్‌మెంట్ 25న లభించే అవకాశాలున్నందువల్ల ఆందోళనను రెండు రోజులు ముందుకు మార్చినట్లు వివరించింది. ఈ మేరకు బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలైంది. పార్టీ శ్రేణులు ఈ మార్పును గమనించాలని అందులో పేర్కొంది. ప్రకటన పూర్తి పాఠం ఇలా ఉంది.
‘‘ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలనాపరంగా అన్ని రంగాల్లో దారుణంగా విఫలమై, నిలువెత్తున అవినీతిలో మునిగి, ఎన్నికల వాగ్దానాలను దారుణంగా ఉల్లంఘించిన టీడీపీ తనకు ప్రజాదరణ కరువైన విషయాన్ని గమనించుకుని... ఏకైక ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను భారీగా డబ్బులు ఎర చూపి కొనుగోలు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. చంద్రబాబు బృందం చేస్తున్న ఈ దుర్మార్గానికి, దిగజారుడుతనానికి నిరసనగా, ప్రజాస్వామ్య పరిరక్షణకోసం ఈనెల 25న జిల్లా కేంద్రాల్లో ‘సేవ్ డెమొక్రసీ’ పేరిట ర్యాలీ, కొవ్వొత్తుల ప్రదర్శన, బహిరంగసభలకు వైఎస్సార్‌సీపీ పిలుపునిచ్చింది.
ఇవే అంశాల్ని రాష్ట్రపతి, ప్రధానమంత్రి, జాతీయ పార్టీల నేతల దృష్టికి తీసుకు వెళ్లనున్న విషయాన్ని కూడా పార్టీ స్పష్టం చేసింది. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అపాయింట్‌మెంట్ 25వ తేదీన లభించే అవకాశాలు స్పష్టమైనందువల్ల, ఆ రోజున తలపెట్టిన ‘సేవ్ డెమొక్రసీ’ కార్యక్రమాలన్నింటినీ రెండు రోజులు ముందుగా, అంటే ఈ నెల 23వ తేదీనే జరపాలని పార్టీ నిర్ణయించింది. ఈ మార్పును గమనించగలరు’’.
లండన్‌కు పలమనేరు ఎమ్మెల్యే దంపతులు
పలమనేరు: తాను, తన సతీమణి రేణుకారెడ్డితో కలసి గురువారం లండన్‌కు వెళుతున్నట్లు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి చెప్పారు. లండన్‌లోని ఓ యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తున్న తమ కుమారుడు త్రాసేన్‌ను చూడడానికి వెళుతున్నట్లు ఆయన తెలిపారు. త్రాసేన్‌కు గత నెలలో అక్కడి విశ్వవిద్యాలయం బంగారు పతకం బహూకరించిందని, అప్పట్లో అసెంబ్లీ సమావేశాల కారణంగా తాము ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయినట్లు పేర్కొన్నారు. అలాగే ఏడాదిగా కుమారుడిని కలవకపోవడంతో ముందస్తుగా ఖరారైన షెడ్యూల్ మేరకు లండన్‌కు వెళుతున్నట్లు అమరనాథరెడ్డి వివరించారు. వారం పాటు లండన్‌లో ఉండి అనంతరం రాష్ట్రానికి తిరిగి రానున్నట్లు తెలిపారు.