పంజగుట్ట: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌కు సంబంధించిన స్థలాలను కబ్జాల నుంచి ప్రభుత్వం కాపాడాలని హెచ్‌పీఎస్ వైస్ చైర్మన్ గుప్తి నోరియా కోరారు. గురువారం ఆయన సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్కూల్‌కు 90 సంవత్సరాల చరిత్ర ఉందని, ఈ స్కూల్‌లో మైక్రో సాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల, మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిలతో పాటు ఎంతో ప్రముఖులు, ప్రజాప్రతినిధులు విద్యనభ్యసించారన్నారు.
ఇంత చరిత్ర ఉన్న తమ విద్యాసంస్థ స్థలాలను కొందరు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. తమ స్కూల్ సర్వే నంబర్ 147/1లోని 2.26 ఎకరాల భూమిని కొందరు ప్రజాప్రతినిధులు, స్థానికులు కబ్జా చేశారన్నారు. దీంతో తమ స్థలాలపై హక్కులను సూచిస్తూ బోర్డులు కూడా ఏర్పాటు చేశారని, గత ఏడాది ఆగస్టులో వాటిని తొలగించి కబ్జా చేశారని దీంతో తాము హైకోర్టును ఆశ్రయించి స్టే తీసుకొచ్చామని తెలిపారు. ఈ ఏడాది హైకోర్టు సెలవులు ఉన్న క్రమంలో ఏకంగా తమ స్థలంలో ప్రహరీ నిర్మించారని, కోర్టు కేసు ఉన్న స్థలంలో ఎలా నిర్మాణాలు చేపడతారని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో హెచ్‌పీఎస్ రిజిస్ట్రార్ కల్నల్ శర్మ, కార్యదర్శి ఫయాజ్‌ఖాన్ పాల్గొన్నారు.