వర్గీకరణ కోసం పోరుబాట
మంద కృష్ణ మాదిగ వెల్లడి
హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ బిల్లును వచ్చే పార్లమెంటు సమావేశంలో పెట్టించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబులపై పోరుబాట సాగిస్తామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తెలిపారు. ఎమ్మార్పీఎస్ 23వ ఆవిర్భావ దినోత్సవం ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో గురువారం రాంనగర్ చౌరస్తాలో ఘనంగా జరిగింది. ఎమ్మార్పీఎస్ జెండాను మంద కృష్ణ మాదిగ ఆవిష్కరించి, తన పుట్టినరోజు కేక్‌ను కట్ చేశారు.
వర్గీకరణ డిమాండ్‌పై చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 16న ఏపీలో, 18న సీఎం కేసీఆర్ నివాసం ఎదుట నిరసన నిర్వహిస్తామన్నారు. ట్యాంక్‌బండ్‌పై గల అంబేడ్కర్ విగ్రహం నుంచి కేసీఆర్ ఇంటి వరకూ భారీ నిరసన ర్యాలీ చేపట్టనున్నట్లు తెలిపారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఈ నెల 19 నుంచి ఆగస్టు 12 వరకూ మాదిగ సమాజంలోని ప్రజలతో ధర్నా కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు.
ఎమ్మార్పీఎస్ దినదినాభివృద్ది చెంది జాతి ప్రయోజనాల కోసం పోరాడుతోం దన్నారు. తమ పోరాటాలతో అణగారిన వర్గాలన్నింటికీ న్యాయం జరుగుతోందన్నారు. ఎమ్మార్పీఎస్ పోరాటం వల్లనే 2004లో ఆరోగ్యశ్రీ పథకాన్ని అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టారని, దీని వల్ల అన్ని కులాల వారు నేడు కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారన్నారు. వృద్ధులు, వితంతువుల, విక లాంగుల పింఛన్లు పెంచారన్నారు. కార్యక్రమంలో పలువురు ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.