సిటీ బిజీ | Schools resume from today | Sakshi
Sakshi News home page

సిటీ బిజీ

Published Mon, Jun 12 2017 12:37 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

సిటీ బిజీ - Sakshi

సిటీ బిజీ

సుదీర్ఘమైన వేసవి సెలవుల తర్వాత నగరంలో సోమవారం నుంచి స్కూళ్లు పునఃప్రారంభమవుతున్నాయి.

నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం
విద్యార్థుల కోసం ముస్తాబైన స్కూళ్లు
పిల్లలను స్కూళ్లకు పంపేందుకు సన్నాహాలు
కొనుగోళ్లతో బిజీగా మారిన బుక్‌ షాపులు..
ప్రభుత్వ స్కూళ్లకు అందని యూనిఫారాలు
రేపటి నుంచి 17 వరకు బడిబాట
మారాం చేస్తే దండించొద్దు..
పుస్తకాల బరువుతో ఆరోగ్యం జాగ్రత్త


సిటీబ్యూరో: సుదీర్ఘమైన వేసవి సెలవుల తర్వాత నగరంలో సోమవారం నుంచి స్కూళ్లు పునఃప్రారంభమవుతున్నాయి. దీంతో విద్యార్థులను ఆకర్షించేందుకు యాజమాన్యాలు పాఠశాలలను ముస్తాబు చేశాయి. స్కూల్‌ క్యాంపస్‌లో అహ్లదకరమైన వాతారవణం కల్పించాయి. పిల్లలను తిరిగి స్కూళ్లకు పంపేందుకు తల్లిదండ్రులు ఏర్పాట్లు చేస్తున్నారు. వేసవి సెలవుల్లో ఆటపాటలకు అలవాటు పడ్డవారు స్కూలుకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతుంటారు. వీరికి నచ్చజెప్పే ప్రయత్నం చేయాలే కానీ దండించడం వల్ల నష్టాలే అధికంగా ఉంటాయని మానసిన వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

భయంతో కాకుండా ఇష్టంతో స్కూలుకు వెళ్లే పరిస్థితి ఇంట్లో కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందంటున్నారు. ఇదిలా ఉంటే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇప్పటి వరకు యూనిఫారాలు అందలేదు. నేటితో విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నా.. ఇప్పటి వరకు క్లాత్‌ కూడా రాలేదు. దీంతో ‘ప్రభుత్వ’ విద్యార్థులు ఈసారి కూడా పాత యూనిఫారాలతోనే స్కూళ్లకు వెళ్లాల్సి వస్తుంది.

వెన్ను వంగకుండా చూడండి
ఆటలతో అలసిపోయిన చిన్నారుల శరీరం బండెడు పుస్తకాల బరువుతో నీరసిస్తోంది. నిటారుగా, దృఢంగా, ఆరోగ్యంగా పెరగాల్సిన వెన్నుపూస.. పది, పది హేనేళ్లకే వంకర్లు పోతోంది. కిండర్‌ గార్డెన్‌లోనే కేజీల బరువు మోయలేని భారంగా మారింది. చిల్డ్రన్‌ స్కూల్‌ బ్యాగ్స్‌ యాక్ట్‌–2006 ప్రకారం.. ఒక విద్యార్థి తన మొత్తం శరీర బరువులో 10 శాతానికి మించి బరువు మోయకూడదు. కానీ నగరంలో నూటికి 90 శాతం మంది తమ బరువు కంటే ఎక్కువగా పుస్తకాల బరువును మోస్తున్నారు. తద్వారా చిన్న వయసులోనే అనేక మంది పిల్లలు వెన్నునొప్పి బారిన పడుతున్నారు. గ్రేటర్‌లోని చిన్నారుల్లోని ప్రతి వందమందిలో 20 మంది వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు వైద్యలు అభిప్రాయపడున్నారు. సాధ్యమైనంత వరకు పిల్లల భుజాలపై తక్కువ బరువు ఉండేలా చూడాలని స్పష్టం చేస్తున్నారు.

రేపటి నుంచి రెండో విడత బడిబాట
ఫ్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట రెండో విడత కార్యక్రమాన్ని ఈనెల 13 నుంచి 17 వరకు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు విధిగా ఆయా ప్రాంతాల్లోని బస్తీలు, కాలనీల్లో ఇంటింటికి వెళ్లి ఆరు నుంచి 14 ఏళ్ల పిల్లలను గుర్తించాలి. ఇప్పటికే బడిలో చేరి మధ్యలో మానేసిన పిల్లలతో పాటు ఇప్పటి వరకు బడిలో అడుగుపెట్టని వారిని తల్లిదండ్రులను ఒప్పించి వారిని పాఠశాలలో చేర్పించాలి. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కమిటీలతో సమావేశమై సమస్యలు, మౌలిక సదుపాయాలపై చర్చించాలి. ప్రజాప్రతినిధులు, అధికారులతో కేవలం ప్రధానోపాధ్యాయులు మాత్రమే వెళ్లాలి. ‘మన ఊరు–మన బడిబాట’ సర్వే, పిల్లల ఆరోగ్య పరీక్షలు, బాలికల విద్య–ఆవశ్యకత, స్వచ్ఛ పాఠశాల/హరితహారం తదిరత కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది.


పిల్లలకు నచ్చజెప్పాలి
పిల్లలు అంతా ఒకే విధంగా ఉండరు. మార్కుల్లో వెనుకబడిన వారే కాదు.. తెలివైన విద్యార్థులు కూడా సెలవులు ముగిశాక తిరిగి స్కూలుకు వెళ్లడానికి ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి సమయంలో తల్లిదండ్రులు వారిని ఒత్తిడి చేయకుండా నచ్చజెప్పాలి. ప్రభుత్వ స్కూళ్లలో చదివి ఉన్నత స్థితికి చేరుకున్నవారి గురించి చెప్పి ఆ దిశగా ప్రోత్సహించాలి.     – రమేష్, డీఈఓ,
 హైదరాబాద్‌

అమ్మతో కలిసి బడికి...
చిన్నప్పుడు బడి ఎప్పుడు తెరుస్తారా అని ఎదురుచూసేవాడిని. అమ్మ ఆదిలక్ష్మి వేలుపట్టుకొని ఉత్సాహంగా బడికి వెళ్లేవాడిని. ఒక్కోసారి మా తాత సుబ్బిరెడ్డి గారు బడికి తీసుకెళ్లేవారు. చిన్నప్పటి నుంచే చదువుకోవాలన్న ఆసక్తి బాగా ఉండేది. లెక్కలు, ఇంగ్లిష్‌ సబ్జెక్టులంటే బాగా ఇష్టం. – ఎన్వీఎస్‌రెడ్డి, హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టు ఎండీ


సున్నితంగా వ్యవహరించాలి
పిల్లలు స్కూలు వాతావరణానికి అలవాటు పడేదాకా టీచర్లు వారితో సున్నితంగా వ్యవహరించాలి. తొలిరోజే బండెడు హోంవర్కు ఇచ్చి బెదరగొట్టొదు. సాధ్యమైనంత వరకు అహ్లదకరమైన వాతావరణం కల్పించాలి. పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. టీవీ, సెల్‌ఫోన్‌కు దూరంగా ఉంచాలి. త్వరగా నిద్రపుచ్చి ఉదయం త్వరగా నిద్రలేచే విధంగా చూడాలి.     – డాక్టర్‌ కళ్యాణ్‌చక్రవర్తి,
మానసిక నిపుణుడు  

పై తరగతికి వెళ్తున్నామనే...
చిన్నప్పుడు తొలిసారిగా మా నాన్న చేతివేలు పట్టుకుని స్కూలుకు వెళ్లాను. వేసవి సెలవులు ముగిసిన తర్వాత స్కూలుకు వెళ్లడం కొంత ఇబ్బందిగా అనిపించినా.. పై తరగతులకు వెళ్తున్నామనే సంతోషం ఉండేది. సీనియర్ల నుంచి సెకండ్‌ హ్యాండ్‌ పుస్తకాలు కొనడడం, వాటికి కవర్లు వేయడం, భద్రంగా సర్దుకోవడం మంచి అనుభూతిని ఇచ్చేంది. ఉపాధ్యాయులు, విద్యార్థులకు మధ్య అవినాభావ సంబంధం ఉండేది. – ప్రొఫెసర్‌ రామచంద్రం, ఓయూ వీసీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement