
కిరోసిన్ కోటాకు కత్తెర
- 4 నుంచి 2 లీటర్లకు కుదింపు
- ధర కూడా పెంచిన ప్రభుత్వం
- ఇప్పటికే రేషన్ చక్కెర నిలిపివేత
సాక్షి, హైదరాబాద్: పేదల కిరోసిన్ కోటాకు కత్తెర పడింది. కేంద్రం సబ్సిడీ ఎత్తివేయడంతో ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేసే చక్కెరకు మంగళం పాడిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా కిరోసిన్ కోటా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు కిరోసిన్ ధర పెంచేసింది. కేంద్ర ప్రభుత్వం కిరోసిన్ కోటాను తగ్గించడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కిరోసిన్ కోటా తగ్గింపును మే నెల నుంచి అమలు చేయాలని జిల్లా పౌరసరఫరాల శాఖాధికారులకు కమిషనర్ ఆదేశించారు.
రెండు లీటర్లకు పరిమితం
ప్రజా పంపిణీ వ్యవస్ధలో ప్రభుత్వ చౌక ధరల దుకాణాల ద్వారా వంటగ్యాస్ కనెక్షన్ లేని ఆహార భద్రత (రేషన్) కార్డుదారులకు కార్పొరేషన్ పరిధిలో నాలుగు లీటర్ల చొప్పున పంపిణీ చేసే కిరోసిన్‌ను రెండు లీటర్లకు కుదించారు. మున్సిపాలిటీల్లో అందించే రెండు లీటర్ల కిరోసిన్‌ను యథాతథంగా ఉంచారు. గ్రామీణ ప్రాంతాల్లో రెండు లీటర్ల చొప్పున పంపిణీæ చేసే కిరోసిన్‌ను లీటరుకు కుదించారు. సిలిండర్ గల లబ్ధిదారులకు పంపిణీ చేసే ఒక లీటర్ యధాతథంగా పంపిణీ చేస్తారు. సబ్సిడీ కిరోసిన్ ధర రూ. 19 నుంచి రూ. 21 లకు పెరిగింది. పన్నెండేళ్ల క్రితం తెల్లకార్డు లబ్ధిదారులకు 23 లీటర్ల చొప్పున, గులాబి కార్డుదారులకు 14 లీటర్ల చొప్పున కిరోసిన్ పంపిణీ జరిగేది. క్రమంగా కిరోసిన్ కోటా కత్తెర పడుతూ వచ్చింది. తాజాగా రెండు లీటర్లకు పరిమితమైంది.
సగానికిపైగా తగ్గిన కోటా
కిరోసిన్ కోటా సగానికి పైగా తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో మొత్తం 85,66,427 ఆహార భద్రత కార్డుదారులుండగా.. అందులో వంటగ్యాస్ కనెక్షన్ లేని కార్డుదారులు 24,42,353 వరకు ఉన్నారు. వీరికి ప్రతి నెలా 90,65,732 కిలోలీటర్ల కిరోసిన్ కోటాను ప్రభుత్వం కేటాయిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరి«ధిలో మొత్తం 12 సర్కిల్స్ పరిధిలో సుమారు 11, 30, 548 కార్డుదారులు ఉండగా అందులో వంటగ్యాస్ కనెక్షన్ లేని కార్డుదారులు 1,97,075 వరకు ఉన్నారు. వీటికి ప్రతినెలా 12,82,870 కిలో లీటర్ల కిరోసిన్ కోటా కేటాయింస్తున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో కిరోసిన్ కోటా సగానికి పైగా తగ్గిపోయినట్లయింది. మరోవైపు గత 4 నెలల నుంచి హైదరాబాద్ సిటీని కిరోసిన్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు వంటగ్యాస్ లేని లబ్ధిదారులకు దీపం పథకం కింద సిలిండర్ కనెక్షన్ల జారీ ప్రక్రియ కొనసాగుతోంది.
సబ్సిడీ భరించలేక...
కేంద్రం ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్ధ ద్వార పంపిణీ చేసే సరుకులపై క్రమంగా సబ్సిడీ ఎత్తేస్తోంది. ఇప్పటికే పామాయిల్, చక్కెరపై సబ్సిడీ ఎత్తివేసిన కేంద్రం తాజాగా సబ్సిడీ కిరోసిన్ కోటాను తగ్గించింది. చమురు కంపెనీల పాయింట్‌ల నుంచి కిరోసిన్ హోల్‌సెల్ డీలర్ల ద్వారా చౌకధరల దుకాణాలకు నీలి కిరోసిన్ సరఫరా జరుగుతుంది. చమురు కంపెనీలు లీటర్ ఒక్కంటికి నీలి కిరోసిన్‌ను రూ. 49ల చొప్పున ప్రభుత్వానికి అందిస్తాయి. అందులో కేంద్ర ప్రభుత్వం రూ. 30 లను సబ్సిడీగా భరించి రేషన్ దుకాణాల ద్వారా కార్డుదారులకు రూ.19లకు పంపిణీ చేసేది. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం తెల్ల కిరోసిన్ లీటర్ ధర రూ. 50 వరకు పలుకుతుంది.