
చౌకధరల చక్కెర సరఫరాకు మంగళం?
ఇప్పటికే సబ్సిడీ ఎత్తివేసిన కేంద్ర ప్రభుత్వం
రేషన్ చక్కెర సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం ఫుల్‌స్టాప్
రూ.150 కోట్ల భారం మోయలేక చేతులు ఎత్తేస్తున్న వైనం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా పౌర సరఫరాల శాఖ నిర్వహిస్తున్న చౌకధరల దుకాణా లు నామ్‌కే వాస్తేగా మిగలనున్నాయి. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజానీకానికి అవసరమైన నిత్యావసర సరుకులను ఈ శాఖ రేషన్ దుకాణాల ద్వారా చౌకధరలకే విక్రయిస్తోంది. ఒక్కొక్కటిగా సరుకుల విక్రయాల నుంచి తప్పుకుంటూ వస్తున్న ప్రభుత్వం.. ప్రస్తుతం బియ్యం, చక్కెర, కిరోసిన్ మాత్రమే అంది స్తోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో చక్కెర కోసం రాష్ట్రాలకు ఇస్తున్న సబ్సిడీని ఎత్తివేసింది. దీంతో రేషన్ షాపుల ద్వారా చక్కెర సరఫరా చేయాలంటే మొత్తం భారమంతా రాష్ట్ర ప్రభుత్వాలే మోయాల్సి వస్తోంది. ఈ కారణంగానే తెలంగాణ ప్రభుత్వం సైతం రేషన్ షుగర్‌కు మంగళం పాడాలని నిర్ణయం తీసుకుందని తెలిసింది.
ప్రభుత్వంపై రూ.150 కోట్ల భారం
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 82 లక్షల రేషన్ కార్డులపై ఒక్కో కార్డుకు అరకేజీ చొప్పున రేషన్ షుగర్‌ను విక్రయిస్తోంది. దీంతో ప్రతి నెలా 4,500 మెట్రిక్ టన్నుల చక్కెర అవసరం పడుతోంది. ఇప్పటి దాకా కేంద్ర ప్రభుత్వం 4 వేల మెట్రిక్ టన్నుల చక్కెరను కిలోకు రూ.18.50 చొప్పున సబ్సిడీ అందించేది. బహిరంగ మార్కెట్‌లోని ధరను పరిగణనలోకి తీసుకుని టెండర్లు నిర్వహించి కేజీ చక్కెరను రూ. 40 నుంచి రూ. 42 దాకా ప్రభుత్వం కొనుగోలు చేసేది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అరకేజీ చక్కెరను రూ.13.50కే వినియోగదారులకు అందించేది. కేంద్రం ఇస్తున్న సబ్సిడీ, వినియోగదారుల నుంచి వసూలు చేసే మొత్తం కేవలం రూ.32 మాత్రమే కాగా, మిగతా ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి వచ్చేది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీని ఎత్తివేయడంతో ఆ భారమంతా రాష్ట్రంపైనే పడనుంది. నెలవారీ కోటా చక్కెర కొనుగోలు, ట్రాన్స్ పోర్టు తదితర ఖర్చులు సహా ఏకంగా రూ.150 కోట్లు వెచ్చించాల్సి వస్తోందని పౌరసరఫరాల శాఖ లెక్క కట్టింది.
ఈ కారణంగానే అసలు రేషన్ చక్కెర విక్రయాల నుంచి పక్కకు తప్పుకోవాలన్న ప్రతిపాదన వచ్చిందని, ప్రభుత్వం దీనికి పచ్చజెండా ఊపిందని విశ్వసనీయ సమాచారం. ఇదివరకు రేషన్ దుకాణాల ద్వారా బియ్యం, చక్కెరకు తోడు పామాయిల్, కందిపప్పు, గోధుమలు, గోధుమపిండి, చింతపండు, కారం తదితర నిత్యావసర సరుకులన్నీ చౌక ధరలకే వినియోగదారులకు అందేవి. కొన్నేళ్లుగా ఒక్కో సరుకుకే కోత పెడుతూ వచ్చారు. ప్రస్తుతం బియ్యం, చక్కెర, కిరోసిన్ సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం చక్కెర సరఫరాను వదిలేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలోని రేషన్ దుకాణాలు కేవలం బియ్యం అమ్మకాలు, కిరోసిన్ సరఫరాకే పరిమితం కానున్నాయి. ప్రభుత్వం కొద్ది రోజుల్లోనే తన నిర్ణయాన్ని ప్రకటించనుందని సమాచారం.