
బియ్యానికే పరిమితం!
► గతంలో తొమ్మిది..ప్రస్తుతం ఒకే ఒక్క సరుకు
► చెక్కరకు మంగళం ∙కిరోసిన్ కోటాకు కోత
► తగ్గుతున్న రేషన్‌షాపుల ప్రాధాన్యం
► అయోమయంలో డీలర్లు
ఆసిఫాబాద్: నిరుపేదలకు ప్రజాపంపిణీ ద్వారా సరఫరా చేసే సరుకులను ప్రభుత్వం ఒక్కొక్కటి తగ్గిస్తోంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల ప్రజలకు సరుకులు తగ్గడంతోపాటు రేషన్ డీలర్ల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ హయాంలో రేషన్ షాపుల్లో బియ్యం, చక్కెర, పామాయిల్, ఉప్పు, కారం, పసుపు, చింతపండు, గోధుమలు, కిరోసిన్‌తో కలిపి తొమ్మిది రకాల వస్తువులను సబ్సిడీ ధరలపై పంపిణీ చేసేవారు.
ప్రభుత్వ విధానాల వల్ల దశల వారీగా ఒక్కో సరుకు బందైంది. గత నెలలో కేంద్ర ప్రభుత్వం చక్కెరపై సబ్సిడీ ఎత్తివేయడంతో రేషన్ షాపుల్లో చక్కెర నిలిచిపోయింది. అలాగే కిరోసిన్ కోటాను కుదించడంతోపాటు ధర కూడా పెంచింది. త్వరలో కిరోసిన్ పంపిణీ కూడా నిలిపివేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కో వస్తువు కనుమరుగవడంతో రేషన్ షాపులు కేవలం బియ్యం పంపిణీ చేసే దుకాణాలుగా మిగిలిపోనున్నాయి.
దుకాణాలు 280
తెల్లరేషన్‌కార్డులు 1,23,567
అంత్యోదయ 12,094
అన్నపూర్ణ 23
బియ్యం సరఫరా 29,644.64 క్వింటాళ్లు
సరుకులు తగ్గించడం సరికాదు
గతంలో రేషన్ దుకాణాల ద్వారా తొమ్మిది రకాల వస్తువులు సబ్సిడీపై సరఫరా చేసేవారు. దశలవారీగా ఒక్కో సరుకును తొలగిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఇచ్చే కిరోసిన్, చక్కెరలో కోత విధించారు. సబ్సిడీ ఎత్తివేశారు. దీంతో ఈ వస్తువులను బయట మార్కెట్‌లో కొనాలంటే ఇబ్బంది. ప్రభుత్వాలు ఇలా సరుకులు తగ్గించి పేదలపై భారం మోపడం సరికాదు. సరుకులు పెంచాలి.
– ఆచార్య మహేశ్, భీంపూర్, ఆసిఫాబాద్ మండలం
యథావిధిగా సరఫరా చేయాలి
ప్రజాపంపిణీ ద్వారా సబ్సిడీపై పేదలకుఅందించే నిత్యావసర వస్తువులను యథావిధిగా కొనసాగించాలి. కిరోసిన్ గతంలో లీటర్ రూ.15 ఉంటే ప్రస్తుతం లీటర్ రూ.21 పెంచారు. అలాగే ఒక్కో సరుకు తగ్గిస్తున్నారు. దీంతో పేద ప్రజలు ఇబ్బందులకు గురవుతారు.
– ముజాయిద్, బజార్‌వాడి, ఆసిఫాబాద్
కిరోసిన్ తగ్గింపు..ధర పెంపు
ప్రభుత్వం మే నెల నుంచి కిరోసిన్ కోటా తగ్గించింది. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ లేని వారికి రెండు లీటర్లు, ఉన్న వారికి ఒక లీటర్ కిరోసిన్ ఇస్తుండగా, ఈ నెలలో అందరికీ ఒకే లీటర్ చొప్పున ఇచ్చారు. అలాగే పట్టణవాసులకు నాలుగు లీటర్లకు బదులు రెండు లీటర్లు ఇవ్వనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి జిల్లా అధికారులకు ఉత్తర్వులు అందాయి. గతంలో లీటర్ కిరోసిన్ ధర రూ.15 ఉండగా, మూడు సార్లు ధరలు పెంచడంతో ప్రస్తుతం లీటర్ కిరోసిన్ రూ.21 చేరింది.
ప్రశ్నార్థకంగా రేషన్ దుకాణాలు
జిల్లాలోని 15 మండలాల్లో 280 రేషన్ దుకాణాలు ఉండగా 1,35,684 రేషన్‌కార్డులు ఉన్నాయి. వీటిలో 12,094 అంత్యోదయ, 1,23,567 తెల్లరేషన్ కార్డులు, 23 అన్నపూర్ణ ఉన్నాయి. వీటి ద్వారా 29644.64 క్వింటాళ్ల బియ్యం సరఫరా చేస్తున్నారు. కార్డుదారులకు ప్రతీనెల కార్డులో ఉన్న వ్యక్తులకు ఒక్కొక్కరికి 6కిలోల బియ్యం, అరకిలో చక్కెరతోపాటు కిరోసిన్ పంపిణీ చేస్తున్నారు. జూన్ కోటాలో చక్కెర తొలగించడంతో వచ్చే నెల నుంచి చక్కెర పంపిణీ నిలిచిపోనుంది. కేవలం అంత్యోదయ కార్డులకు మాత్రమే కిలో చెక్కర పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ నుంచి రేషన్‌షాపుల్లో కేవలం బియ్యం, కిరోసిన్ మాత్రమే పంపిణీ చేయనున్నారు. క్రమంగా ప్రభుత్వం రేషన్ షాపులకు మంగళం పాడనున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అంత్యోదయకు మాత్రమే చక్కెర
జూన్ నుంచి అంత్యోదయ కార్డులకు మాత్రమే కిలో చక్కెర పంపిణీ జరుగుతుంది. మిగతా కార్డుదారులకు చక్కెర కేటాయించలేదు. దీంతో కేవలం బియ్యం, కిరోసిన్ మాత్రమే ఇస్తాం.
– సత్యనారాయణ, డీఎస్‌వో, ఆసిఫాబాద్