సిటీపై డెంగీ దాడి
► నగరాన్ని వణికిస్తున్న సీజనల్ వ్యాధులు
► శుక్రవారం ఒక్కరోజే 10 డెంగీ,
► 2 స్వైన్‌ఫ్లూ కేసుల నమోదు
► డెంగీ, డిఫ్తీరియాతో 11 మంది మృత్యువాత
► తాజాగా మెహదీపట్నంలో మరో బాలిక మృతి
► కార్యాచరణ ప్రణాళిక రూపొందించని అధికారులు
► సీజనల్ వ్యాధులపై ఆందోళనలో బస్తీవాసులు
సాక్షి, హైదరాబాద్: ‘గ్రేటర్’లో సీజనల్ వ్యాధులు మృత్యు ఘంటికలు మోగిస్తున్నాయి. డెంగీ, డిఫ్తీరియా తదితర వ్యాధులు నగరంలో వేగంగా విస్తరిస్తూ.. ప్రజల ప్రాణాలు హరిస్తున్నాయి. గత 15 రోజుల్లో డిఫ్తీరియాతో ఏడుగురు, డెంగీతో నలుగురు మృత్యువాతపడ్డారు. శుక్రవారం గుడిమల్కాపూర్ మందులగూడలో ఏడేళ్ల బాలిక డెంగీతో ప్రాణాలు కోల్పోయింది.
చిత్తూరు జిల్లాకు చెందిన మహేశ్‌రెడ్డి భార్యపిల్లలతో మందులగూడలోని ఓ ఇంటిలో అద్దెకు ఉంటున్నాడు. మహేశ్ కుమార్తె పి.పాయస్యా(7) గుడిమల్కాపూర్‌లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో 2వ తరగతి చదువుతోంది. కొన్ని రోజులుగా ఆమె జ్వరంతో బాధపడుతుండటంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో గురువారం రాత్రి పాయస్యా మృతి చెందింది. మరోవైపు శుక్రవారం ఒక్కరోజే సికింద్రాబాద్‌లోని వివిధ ఆస్పత్రుల్లో ఐదు, ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో నాలుగు, ఫీవర్ ఆస్పత్రిలో ఒక డెంగీ, మరో రెండు స్వైన్‌ఫ్లూ కేసులు నమోదవటంతో బస్తీవాసుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. స్వైన్‌ఫ్లూతో గుల్బార్గాకు చెందిన ఓ మహిళ(33) యశోద ఆస్పత్రిలో, బోరబండకు చెందిన బాలిక(4) లోటస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. యశోదలో చికిత్స పొందుతున్న మహిళ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలిసింది.
ఆరోగ్య శిబిరాల ఊసే లేదు..
గత కొంత కాలంగా కలరా, డెంగీ, డిఫ్తీరియా, స్వైన్‌ఫ్లూ వంటి వ్యాధులు నగరంలో విస్తరిస్తూ.. ప్రజల ప్రాణాలను హరిస్తున్నా అధికారుల్లో చలనం రావడం లేదు. పైగా సీజనల్ వ్యాధుల కారణంగా నమోదైన మరణాలను గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తుండటం విమర్శలకు తావిస్తోంది. అంతే కాకుండా వ్యాధుల నివారణకు కనీస చర్యలను కూడా వారు చేపట్టడం లేదు. దోమల నియంత్రణకు గ్రేటర్ ఏటా రూ.20 కోట్లకుపైగా ఖర్చు చేస్తోంది. వర్షాకాలానికి ముందే యాంటి లార్వా, మలాథియాన్ స్ప్రే చేయడం, ఫాగింగ్ నిర్వహించడం వంటి పనులు చేయాలి. కానీ చాలా బస్తీలు ఇప్పటి వరకు ఫాగింగ్‌కే నోచుకోలేదు. అలాగే సీజన్ మార్పుతో వచ్చే వ్యాధులపై హై రిస్క్ బస్తీల్లో ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలి. ఇంటింటికీ కరపత్రాల పంపిణీతో వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాలి. కానీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తీసుకున్న చర్యలు శూన్యం. లక్షలు ఖర్చు చేసి ముద్రించిన కరపత్రాలు కూడా జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి కార్యాలయంలో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని స్టోర్‌రూమ్స్‌లోనే మగ్గుతున్నాయి. అంతే కాకుండా సీజనల్ వ్యాధులకు సంబంధించి ఏ ఆస్పత్రిలో ఏ కేసు న మోదవుతుందో కూడా తెలుసుకునేందుకు కూడా అధికారులు ప్రయత్నించడం లేదు. ఆస్పత్రి నుంచి ఫోన్ చేసి సమాచారం ఇస్తే తప్ప ఫీల్డ్ విజిట్ వెళ్లట్లేదు. ఇదిలా ఉంటే ఫీవర్ ఆస్పత్రికి రోగుల తాకిడి అంతకంతకూ పెరుగుతోంది. శుక్రవారం 1,750 మందికిపైగా రోగులు ఆస్పత్రికి రాగా.. వీరిలో 30 మందిని అడ్మిట్ చేసుకుని చికిత్స చేస్తున్నారు.
గ్రేటర్‌లో నమోదైన సీజనల్ వ్యాధులు ఇలా..
వ్యాధి పేరు 2011 2012 2013 2014 2015 2016
మలేరియా 352 528 189 125 84 112
డెంగ్యూ 177 452 52 19 140 105
స్వైన్‌ఫ్లూ 11 320 67 31 1,082 8