ఈసారి శక్తిపీఠ మహాగణపతి
58 అడుగుల ఎత్తులో దర్శనం ఇవ్వనున్న ఖైరతాబాద్ గణేశుడు
హైదరాబాద్: ఏటా వివిధ రూపాల్లో కొలువుదీరే ఖైరతాబాద్ వినాయకుడు ఈ సంవత్సరం ‘‘శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతి’’గా భక్తులకు దర్శనమివ్వనున్నారు. 58 అడుగుల ఎత్తులో రూపొందిస్తున్నట్టు ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ ప్రకటించింది. శనివారం ఈ మహాగణపతి చిత్రాన్ని ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. వినాయక చవితి నాటికి ఖైరతాబాద్ రైల్వేస్టేషన్ వద్ద సబ్‌వే పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే చెప్పారు. ‘శక్తి పీఠాలను దర్శించుకొంటే జ్ఞానం, శక్తి అనుగ్రహం దక్కుతాయి.
వర్షాలు సమృద్ధిగా కురిసి తెలుగు రాష్ట్రాలు సస్యశ్యామలంగా ఉండాలనే ఉద్దేశంతో తిరుపతి బాలాజీ, బృందావన సహిత గోవర్ధనగిరిని ఏర్పాటు చేయాలని సూచించా. వీటికి అనుగుణంగానే శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతిగా నామకరణం చేశాం’ అని మేడిపల్లి జ్యోతిర్మయ మహాపీఠం దివ్యజ్ఞాన సిద్ధాంతి విఠలశర్మ తెలిపారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ ప్రత్యేకతలు...
నీలి వర్ణంలో నిలిచుని అభయమిచ్చే మహాగణపతి కుడివైపు 18 శక్తిపీఠాలలో మొదటిదైన శ్రీలంకలోని శాంకరీదేవి విగ్రహం, ఎడమవైపు చివరి శక్తిపీఠమైన జమ్ముకశ్మీరులోని సరస్వతి విగ్రహం 10 అడుగుల ఎత్తులో ఉంటాయి. వినాయకుడి వెనుకవైపు భారీ పుట్ట, దానికి ఇరు వైపులా పాలాభిషేకం చేస్తున్నట్టు రెండు ఆవులు, భారీ శివలింగం ఉంటాయి. మహాగణపతిపై పడగవిప్పిన శేషు ఉంటుంది. గణపతి ఆరు చేతుల్లో విష్ణుచక్రం, శంకం, ఆశీర్వాదం, లడ్డూ, గధ, కమలం ఉంటాయి. ఇక గణపతికి ఇరువైపులా 15 అడుగుల ఎత్తులో తిరుమల వెంకన్న, బృందావన సహిత గోవర్ధనగిరిధారుడు దర్శనమిస్తారని శిల్పి రాజేంద్రన్ తెలిపారు.