కన్హయ్యపై చెప్పులు విసిరిన యువకులు
సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ సమావేశం రసాభాసగా మారింది. కన్హయ్య తన ప్రసంగం మొదలుపెట్టబోతుండగానే అతడి వ్యతిరేకులలో 'గోరక్షాదళ్'కు చెందిన ఇద్దరు యువకులు ఒక్కసారిగా లేచి.. 'భారత్ మాతాకీ జై' అంటూ కన్హయ్యపై చెప్పులు విసిరారు. ఈలోపు హాల్లో ఉన్న ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు ఆ ఇద్దరినీ పట్టుకుని చితక్కొట్టారు. ఆ ఇద్దరూ మీడియా ఉన్నవైపు రావడంతో.. మీడియా కెమెరా స్టాండ్లు తీసుకుని వాటితో వాళ్లను కొట్టారు. ఈ ప్రయత్నంలో వీడియో కెమెరాలు కూడా కొన్ని పగిలాయి. వాళ్లను ఏమీ అనొద్దని, ఊరుకొమ్మని కన్హయ్య కుమార్ చెబుతున్నా పరిస్థితి మాత్రం అదుపులోకి రాలేదు. ఈలోపు అక్కడే ఉన్న పోలీసులు వచ్చి వాళ్లిద్దరినీ బయటకు తీసుకెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అయితే, కావాలనే ఈ సమావేశానని రసాభాస చేయాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు ఖాద్రీ అన్నారు.
దీనిపై ఆ తర్వాత ప్రసంగించిన కన్హయ్య కూడా స్పందించాడు. కొంతమంది తనను కొట్టి పబ్లిసిటీ తెచ్చుకోవాలనుకుంటున్నారని, కానీ చెప్పులు, రాళ్లు విసిరితే ప్రయోజనం ఉండదని చెప్పాడు. ఈ రోజు తన మీద చెప్పులు విసిరిన వాళ్ల మీద గానీ, నిన్న తనను కొట్టినవాళ్ల మీద గానీ తనకు ఏమాత్రం కోపం లేదని.. వాళ్ల వల్ల తనకు మరింత మేలు జరుగుతుందని అన్నాడు. చివరకు తనను జైలుకు పంపినవారి మీద కూడా ఎలాంటి కోపం లేదని అన్నాడు. రాళ్లు, చెప్పులు మీమీదే వేసుకుంటున్నారని రేపు మీకు అర్థం అవుతుందని తెలిపాడు.