కన్హయ్య కుమార్ ఏమైనా ఉగ్రవాదా..?
ఢిల్లీ జేఎన్యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్ను మహారాష్ట్ర అసెంబ్లీ విజిటర్స్ గ్యాలరీలోకి అనుమతించకపోవడంపై కాంగ్రెస్ తీవ్రంగా తప్పుపట్టింది. సభలోకి కన్హయ్యను అనుమతించకపోవడానికి అతనేమైనా ఉగ్రవాదా అని కాంగ్రెస్ ఎమ్మెల్యే నదీన్ ఖాన్ విమర్శించారు. బుధవారం మహారాష్ట్ర అసెంబ్లీలో నదీన్ ఖాన్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. కన్హయ్య ఉగ్రవాది కాదని, ప్రజాస్వామ్యంలో ఎవరైనా సభ కార్యకలాపాలను వీక్షించవచ్చని చెప్పారు. అసెంబ్లీలోకి వచ్చేందుకు కన్హయ్యకు పాస్ ఉందని, అతన్ని అనుమతించకపోవడానికి తగిన కారణంలేదని అన్నారు.
అసెంబ్లీ స్పీకర్ బగడే స్పందిస్తూ.. మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు తెలుసుకుని పరిశీలిస్తానని చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ మాట్లాడుతూ కన్హయ్యను అసెంబ్లీలోకి అనుమతించకపోవడం సిగ్గుమాలిన చర్య అని విరుచుకుపడ్డారు. కన్హయ్యను అడ్డుకున్నవారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిన్న విద్యార్థి సంఘం కార్యక్రమంలో పాల్గొనేందుకు కన్హయ్య ముంబై వచ్చాడు. ఈ విషయంపై కన్హయ్య స్పందిస్తూ.. విధాన సభ కార్యకలాపాలు చూడాలని కోరానని, ప్రత్యేకించి సభలో విదర్భపై జరిగే చర్చ వినాలనుకున్నానని, అయితే తనను అనుమతించలేదని చెప్పాడు.