దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలపై దాడి: కన్హయ్య
దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల మీద ఒక సీరియస్ దాడి జరుగుతోందని జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ అన్నాడు. సుందరయ్య విజ్ఞానకేంద్రంలో గురువారం ఉదయం కన్హయ్య మీడియాతో మాట్లాడాడు. తొలుత హెచ్‌సీయూలో ఘటన జరిగిందని, తర్వాత జేఎన్‌యూలో విద్యార్థులను తప్పుపట్టారని అన్నాడు. పోనీ ఈ రెండింటినీ పక్కన పెడితే అలీగఢ్ యూనివర్సిటీ మైనారిటీ హోదాను తప్పించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించాడు. మొత్తంగా అసలు విద్యార్థుల ఆందోళనను డీలెజిటమేట్ చేసే ప్రయత్నం ఒకటి జరుగుతోందని ఆరోపించాడు. జస్టిస్ ఫర్ రోహిత్ వేముల ఆందోళనను ఢిల్లీలో కొనసాగించాలని తాము ముందుగానే నిర్ణయించుకున్నామని, ఇక్కడ ఘటన జరిగిన తర్వాత తాను ఇక్కడికొచ్చి విద్యార్థి సంఘాల నేతలతో మాట్లాడానని తెలిపాడు.
ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్లిన తర్వాత అక్కడ జేఏసీ ప్రారంభించామని, అంబేద్కర్ భవన్ నుంచి ఆర్ఎస్ఎస్ ఆఫీసు వరకు నిరసన ప్రదర్శన నిర్వహించామని, తర్వాత బహిరంగ సభ కూడా నిర్వహించామని తెలిపాడు. రోహిత్ వేముల ఆందోళనకు జేఎన్‌యూలో జరిగిన ఆందోళన కేవలం ఒక కొనసాగింపు మాత్రమేనని వెల్లడించాడు. అయితే ప్రభుత్వం మాత్రం ఈ రెండింటినీ ఒక దానికి ఒకటి పోటీగా చేయాలనుకుందని అన్నాడు. తాను జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా.. తనకు ఆదర్శప్రాయుడు అఫ్జల్ గురు కాదు, రోహిత్ వేములేనని చెప్పానని గుర్తుచేశాడు.
తాను హెచ్‌సీయూకు రావాలని ముందుగానే నిర్ణయించుకున్నామని, కానీ అనుకోకుండా జరిగిందో.. కావాలనే చేశారో గానీ తాను రావడానికి ఒక్కరోజు ముందే అప్పారావు మళ్లీ వీసీగా బాధ్యతలు స్వీకరించారని కన్హయ్యకుమార్ అన్నాడు. ఆయన మద్దతుదారులు దండలతో ఆయనకు స్వాగతం పలికారని, తర్వాత శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న విద్యార్థులను రెచ్చగొట్టడంతో హింసాత్మక ఘటనలు జరిగాయని తెలిపాడు. తనకు ప్రజాస్వామ్యంపై నమ్మకముందని, హింసను ఎట్టి పరిస్థితుల్లో సమర్థించబోనని అన్నాడు. కానీ ఇక్కడ మాత్రం అమ్మాయిలను మగ పోలీసులతో కొట్టించారని, విద్యుత్, వై-ఫై కట్ చేశారని, చివరకు అధ్యాపకులను కూడా కొట్టి, అరెస్టుచేసి జైళ్లలో పెట్టారని చెప్పాడు. పోలీసులు తొలుత తనను యూనివర్సిటీలోకి అనుమతించాలనే అనుకున్నారట గానీ.. తర్వాత అంతర్గత భద్రతా సమస్యల వల్ల పంపలేదని చెప్పారని.. ఆ అంతర్గత భద్రతను భంగపరిచింది ఎవరని ప్రశ్నించాడు. జేఎన్‌యూ - హెచ్‌సీయూలలో ఒకేలాంటి పోలికలు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించాడు.