కన్హయ్య రాక.. బీజేపీ కాక
కృష్ణా : జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ రాకతో ఐవీ ప్యాలెస్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకున్న కన్హయ్య అక్కడ నుంచి నేరుగా ఐవీ ప్యాలెస్ సభస్థలికి చేరుకున్నారు. అయితే దేశ ద్రోహం కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కన్హయ్య రాకను బీజేపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. సభా ప్రాంగణంలోకి వెళ్లేందుకు పలువురు బీజేపీ నేతలు యత్నించారు. ఈ సందర్భంగా బీజేపీ, సీపీఐ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.
కాగా హైదరాబాద్ లో ఈ రోజు(గురువారం) ఉదయం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కన్హయ్య కుమార్ పాల్గొన్న సమావేశం రసాభాసగా మారిన విషయం తెలిసిందే. 'గోరక్షాదళ్'కు చెందిన ఇద్దరు యువకులు ఒక్కసారిగా లేచి.. 'భారత్ మాతాకీ జై' అంటూ చెప్పులు విసిరారు. ఈలోపు హాల్లో ఉన్న ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు ఆ ఇద్దరినీ పట్టుకుని చితక్కొట్టారు. ఆ ఇద్దరూ మీడియా ఉన్నవైపు రావడంతో.. మీడియా కెమెరా స్టాండ్లు తీసుకుని వాటితో వాళ్లను కొట్టారు. ఈ ప్రయత్నంలో వీడియో కెమెరాలు కూడా కొన్ని పగిలాయి. ఈలోపు అక్కడే ఉన్న పోలీసులు వచ్చి వాళ్లిద్దరినీ బయటకు తీసుకెళ్లి అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.