హైదరాబాద్, బిజినెస్ బ్యూరో
సీటీసీ పేరు చెప్పగానే తొలుత గుర్తొచ్చేది కంప్యూటర్లే. హైదరాబాద్ సహా రాష్ట్రంలో కంప్యూటర్ల అమ్మకాలకిది కేంద్ర స్థానం. పొరుగు రాష్ట్రాల నుంచి సైతం ఇక్కడకు వచ్చి మరీ కంప్యూటర్లు కొంటారంటే దీని ప్రాభవాన్ని వేరే చెప్పనక్కర్లేదు. రోజుకు 30 వేల పైచిలుకు కస్టమర్లతో కళకళలాడిన సీటీసీ... ఇప్పుడు వెలవెలబోతోంది. ఇపుడు రోజుకు రెండు మూడు వేల మంది కస్టమర్లు వస్తే అదే ఎక్కువ!! అసెంబుల్డ్ డెస్క్‌టాప్‌ల వినియోగం తగ్గడం, ఆన్‌లైన్ కంపెనీల జోరు ఒక ఎత్తై.. కొందరు వ్యాపారుల గిమ్మిక్కులతో సీటీసీ ప్రాభవాన్ని కోల్పోతోందన్నది స్థానిక విక్రేతల మాట.
తొలి ప్రభావం సీటీసీపైనే..
1990ల తొలినాళ్లలో సికింద్రాబాద్‌లో సీటీసీ ఏర్పాటయింది. దాదాపు 300 దుకాణాలు కంప్యూటర్లు, విడిభాగాలు విక్రయిస్తుంటాయి. ఆరేళ్ల కిందట 10-15 పెద్ద దుకాణాలు రోజుకు సగటున
రూ.20 లక్షల వ్యాపారం చేసేవి. ఒక్కోరోజు రూ.4-5 కోట్లు ఆర్జించిన సందర్భాలూ ఉన్నాయి. చిన్నాచితకా దుకాణాలైతే కిటకిటలాడుతూ రోజుకు రూ.2 లక్షల వ్యాపారం చేసేవి. అయితే ఇప్పుడంతా తారుమారైంది. 80% వ్యాపారం పడిపోయింది. క్యాష్ అండ్ క్యారీ బిజినెస్ కావటంతో చాలా మంది వ్యాపారులు గిరాకీ లేక నష్టాల్లోకి జారుకున్నారు. కొన్ని దుకాణాలు మూతపడ్డాయి. కొందరు బ్రాండెడ్ కంపెనీలకు ఫ్రాంచైజీలుగా మారారు. కొందరు సీటీసీ వదిలి సొంత దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారు.
అసలు దెబ్బ ఆన్‌లైన్‌దే...
2000వ సంవత్సరం నుంచి తొమ్మిదేళ్ల పాటు కంప్యూటర్ విడిభాగాల విక్రేతలకు స్వర్ణయుగమని చెప్పాలి. 2005-2008 మధ్య అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. 2008 లో డెస్క్‌టాప్ పీసీల అమ్మకాల్లో అసెంబుల్డ్ వాటా 80 శాతం వరకూ ఉండేది. అప్పట్లో అసెంబుల్డ్ డెస్క్‌టాప్‌లు రాష్ట్రంలో నెలకు సుమారు 25,000 వరకూ అమ్ముడయ్యేవి. కానీ ఇపుడు నెలకు 1,500 కూడా దాటడం లేదు. బ్రాండెడ్ పీసీల ధరలు తగ్గటంతో పాటు ల్యాప్‌టాప్‌ల జో రు పెరగటం దీనికి ప్రధాన కారణమని విక్రేతలు చెబుతున్నారు. ఆన్‌లైన్ కంపెనీలు తమకన్నా తక్కువ ధరకు విక్రయిస్తుండటం మరో కారణమంటున్నారు. ‘అప్పట్లో రిటై ల్ మార్కెట్లో రాష్ట్రంలో నెలకు 20 వేల ల్యాప్‌టాప్‌లు అ మ్ముడయ్యేవి. ఇపుడిది 7 వేల లోపే’ అని ఐటీ మాల్ ఎం డీ మొహమ్మద్ చెప్పారు. ట్యాబ్లెట్ల రాకతో ల్యాప్‌టాప్‌లు కూడా ఉనికి కోల్పోతున్నాయని వ్యాఖ్యానించారాయన.
సీటీసీ మూతపడ్డా ఆశ్చర్యం లేదు...
సీటీసీలో ఒక ఉత్పాదనకు ఒకో దుకాణంలో ఒక్కో ధర ఉంటోంది. కొనుగోలుదారులకిది చిరాకు తెప్పిస్తోంది. దీనికితోడు కొందరు వ్యాపారులు నకిలీ విడిభాగాలను అంటగడుతున్నారు. చెన్నై విమానాశ్రయంలో దొంగతనానికి గురైన హెచ్‌పీ కంపెనీ ల్యాప్‌టాప్‌లు సీటీసీలో ప్రత్యక్షమవడం అప్పట్లో సంచలనం సృష్టించింది. కష్టాల్లో ఉన్న వ్యాపారులను గుర్తించి, వారి వద్ద నిల్వ ఉన్న సరుకును తక్కువ ధరకు కొనుగోలు చేసే గ్రూపు ఒకటి సీటీసీలో తన హవా కొనసాగిస్తోందని తెలిసింది. బ్లాక్‌మనీని వాడుకలోకి తేవడానికి ప్రముఖులు కొందరు దుకాణదారులకు నిధులు సమకూరుస్తున్నారని కూడా వినిపిస్తోంది. ఈ దుకాణదారులు తక్కువ ధరకు ఉపకరణాలు విక్రయిస్తున్నారని పేరు వెల్లడి కావటానికి ఇష్టపడని వ్యాపారి ఒకరు చెప్పారు. సీటీసీ తన ప్రాశస్త్యాన్ని కోల్పోయే ప్రమాదంలో ఉందని, మూడేళ్లలో మూతపడ్డా ఆశ్చర్యం లేదన్నారు.
బ్రాండెడ్‌కు మళ్లాం..
ఆరేళ్ల క్రితం నెలకు 500 డెస్క్‌టాప్‌లు అసెంబుల్ చేసేవాళ్లం. బ్రాండెడ్ ఉత్పత్తుల ధరలూ దిగొచ్చాయి. దీంతో ఇప్పుడు అసెంబుల్డ్ పీసీల సంఖ్య 50 లోపే ఉంటోంది. కస్టమర్లు బ్రాండెడ్‌ను కోరుకుంటున్నారు. అందుకే దేశంలో తొలిసారిగా 10 బ్రాండ్లతో మాల్ ఏర్పాటు చేశాం. సీటీసీ నుంచి చాలా మంది వెలుపలికి వచ్చి బ్రాండెడ్ దుకాణాలను తెరుస్తున్నారు. 20 ఏళ్ల క్రితం సీటీసీని రాజ్యమేలిన దుకాణాలు కనుమరుగయ్యాయి. ఆన్‌లైన్‌లో తక్కువకు దొరుకుతున్నాయని కస్టమర్లు కొంటున్నారు. కానీ విక్రయానంతర సేవలు ఏమేరకు లభిస్తాయోనన్నది ప్రశ్నే.
- మొహమ్మద్ అహ్మద్, ఎండీ, ఐటీ మాల్
ఆన్‌లైన్ దెబ్బతో మూతపడుతున్న షాపులు
Published Fri, Nov 15 2013 3:41 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement