
'గొలుసు దొంగలు ఏం చేస్తున్నా.. చూస్తూ ఉండాలా?'
సాక్షి, హైదరాబాద్: ఇటీవల హైదరాబాద్ నగరంలో గొలుసు దొంగలపై పోలీసులు జరిపిన కాల్పులు జరిపిన వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. దొంగలపై సానుభూతి చూపేలా వ్యాజ్యం ఉందని, దీనినిబట్టి గొలుసు దొంగలు ఏం చేస్తున్నా పోలీసులు చూస్తూ ఉండాలా? అంటూ పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. దీంతో పిటిషనర్ తన వ్యాజ్యాన్ని ఉపసంహరించుకునేందుకు అనుమతి కోరారు. ఇందుకు అంగీకరిస్తూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బీ బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రజల రక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకోకుండా పోలీసులు కాల్పులు జరిపారని, ఈ విధంగా కాల్పులకు పాల్పడకుండా పోలీసులను ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ మహ్మద్ అబ్దుల్ సమద్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. వ్యాజ్యాన్ని పరిశీలించిన ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అసలు ఈ వ్యాజ్యం ఏవిధంగా విచారణార్హమైనదో చెప్పాలని ప్రశ్నించింది.
'ఈ వ్యాజ్యం గొలుసు దొంగలపై సానుభూతి చూపేలా ఉంది. పోలీసులకు కాల్పులు ఎలా జరపాలో తెలుసు. భద్రతా చర్యల గురించి వారికి మనం చెప్పాల్సిన అవసరం లేదు. గొలుసు దొంగలు ఏం చేస్తున్నా పట్టించుకోవద్దా? వారి అరాచకాలు పెరిగిపోతున్నా చూస్తూ ఉండాలా? మేం ఈ వ్యాజ్యాన్ని కొట్టివేస్తాం' అని ధర్మాసనం పేర్కొంది. దీనికి పిటిషనర్ స్పందిస్తూ, ఈ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకుంటామని, అనుమతినివ్వాలని కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరించింది.