రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖలో సాంకేతిక వ్యవస్థలన్నీ సంపూర్ణంగా బంద్ అయ్యాయి.
గత నెల 18తో ముగిసిన టీసీఎస్ కాంట్రాక్ట్
సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖలో సాంకేతిక వ్యవస్థలన్నీ సంపూర్ణంగా బంద్ అయ్యాయి. సంస్థకు ఫెసిలిటీ మేనేజర్‌గా ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) కాంట్రాక్ట్ గడువు ముగిసిపోవడమే కారణంగా తెలుస్తోంది. గతనెల 18న గడువు ముగియనుందని తెలిసినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఆ శాఖ ఉన్నతాధికారులు గానీ, ప్రభుత్వ పెద్దలు గానీ దృష్టి సారించకపోవడం విచారకరం. కాంట్రాక్ట్ గడువు ముగిసినందున రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న తమ సర్వీస్ ఇంజనీర్లను టీసీఎస్ వెనక్కి తీసుకుంది. ఫలితంగా రాష్ట్రంలో ఆన్‌లైన్ సేవలకు ఆటంకం ఏర్పడింది.
కొత్త ఫెసిలిటీ మేనేజర్ నియామకానికి టెండర్లు పిలవాలని రాష్ట్ర ఐటీ శాఖను రిజిస్ట్రేషన్ల శాఖ విన్నవించినా, వారు పట్టించుకోలేదని సమాచారం. ఇప్పటికీ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల శాఖకు ప్రత్యేక సర్వర్ లేదు. ఉమ్మడిగానే సర్వర్‌ను, ఇంటర్నెట్ కోసం స్టేట్‌వైడ్ ఏరియా నెట్‌వర్క్(స్వాన్)ను వినియోగిస్తున్నారు. సర్వర్లకు సంబంధించి ఉత్పన్నమవుతున్న సమస్యల పరిష్కారానికి మహారాష్ట్ర, కర్ణాటకల్లో అధ్యయనం చేసిన ఉన్నతాధికారులు మల్టీ ప్రోటోకాల్ లేబుల్ స్విచింగ్ (ఎంపీఎల్‌ఎస్) వ్యవస్థను ఏర్పాటు చేయా లని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. సర్కారు నుంచి స్పందన లేదని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలంటున్నాయి.