
ప్రధాని బందోబస్తు కోసం వచ్చి...
యువ ఎస్సై ఆత్మహత్య
- సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని బలవన్మరణం
- రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
- మృతుని స్వస్థలం వరంగల్
హైదరాబాద్: అన్ని రాష్ట్రాల డీజీపీల సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్‌లోని నేషనల్ పోలీసు అకాడమీ(ఎన్‌పీఏ)కి వచ్చిన ప్రధాని మోదీ బందోబస్తు విధుల కోసం రాజధానికి వచ్చిన ఓ యువ ఎస్సై అనూహ్యంగా ఆత్మహత్య చేసుకున్నాడు. అసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి ఠాణా ఎస్సై బోరిగం శ్రీధర్ (34) శుక్రవారం రాత్రి దాదాపు 11 గంటల సమయంలో పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నంబర్ 173 వద్ద నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో తన సర్వీస్ రివాల్వర్‌తో గుండెల్లో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అరుుతే శనివారం ఉదయం వరకూ ఈ ఘటనను ఎవరూ గుర్తించలేదు.
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పోలీసుల కథనం ప్రకారం...వరంగల్ నగరంలోని పైడిపల్లి గ్రామానికి చెందిన శ్రీధర్ గురువారం రాత్రే రాజధానికి వచ్చాడు. పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నంబర్ 173 (ఉప్పర్‌పల్లి) వద్ద నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్ 19వ అంతస్తు నుంచి హోంగార్డు దీపక్‌తో కలసి శుక్రవారం రాత్రి 10.30 గంటల వరకు బందోబస్తు విధులు నిర్వహించాడు. ఆ తర్వాత కిందకు వెళదామని దీపక్ కోరగా తాను రానని చెప్పి దీపక్‌ను పంపించాడు. అనంతరం ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో బీట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఓ యువతితో చివరిసారిగా ఫోన్లో మాట్లాడాడు. అరుుతే దాదాపు రాత్రి 11 గంటల సమయంలో ఒక్కసారిగా సర్వీసు రివాల్వర్‌ను గుండెకు గురిపెట్టుకొని కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
శ్రీధర్ రిలీవర్ అరుున మరో ఎస్సై రాజేశ్ విధుల కోసం శనివారం ఉదయం 10 గంటలకు 19వ అంతస్తుకు వెళ్లగా రక్తపు మడుగులో శ్రీధర్ పడిఉండటాన్ని చూసి వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. హుటాహుటిన పోలీసు అధికారులు అక్కడికి చేరుకొని పంచానామా నిర్వహించి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అరుుతే కుటుంబ పరిస్థితులు, ప్రేమ వ్యవహారం కారణంగానే శ్రీధర్ ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబంలోని గొడవలతో మనోవేదనకు గురైన శ్రీధర్ ఆఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చని రాజేంద్రనగర్ ఏసీపీ గంగారెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
పైడిపల్లిలో విషాదం
పైడిపల్లికి చెందిన కొమురయ్య మూడో కుమారుడైన శ్రీధర్ ఆత్మహత్య వార్త తెలియడంతో ఆ గ్రామంలో విషాదం అలుముకుంది. కొడుకు మరణవార్త తెలియగానే తల్లి జమున కుప్పకూలింది. బంధువులు, మిత్రులు, గ్రామస్తులు అతనికి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
తొలి ప్రయత్నంలోనే కానిస్టేబుల్
చింతలమానెపల్లి: చిన్నప్పటి నుంచీ చదువులో చురుకుగా ఉండే శ్రీధర్...డిగ్రీ అనంతరం 2007లో తొలి ప్రయత్నంలోనే స్పెషల్ పోలీస్ (టీఎస్‌ఎస్‌పీ)బెటాలియన్‌కు కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. అనంతరం 2012 బ్యాచ్‌లో ఎస్సై ఎంపికయ్యాడు. తొలిసారిగా 2014లో గుడిహత్నూర్‌లో ఎస్సైగా విధులు నిర్వహించాడు. 2015లో ముథోల్‌లో పనిచేసి కాగజ్‌నగర్‌కు బదిలీపై వచ్చిన శ్రీధర్...2016 అక్టోబర్ వరకు కాగజ్‌నగర్ రూరల్ ఎస్సైగా విధులు నిర్వహించాడు. ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్పెషల్ బ్రాంచ్‌కు బదిలీ అయ్యాడు. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనలో భాగంగా కొత్తగా ఏర్పడిన చింతలమానెపల్లి మండల ఎస్సైగా అక్టోబర్ 12న బాధ్యతలు చేపట్టాడు.
ప్రేమ వ్యవహారమే కారణం?
హసన్‌పర్తి: ఎస్సై శ్రీధర్ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. కులాలు వేరు కావడంతో ప్రేమించిన యువతితో పెళ్లికి నిరాకరించిన కుటుంబ సభ్యులు అతనికి పెళ్లి సంబంధాలు చూస్తుండటం, అదే సమయంలో యువతికి మరో వ్యక్తితో వివాహం కుదరడం వల్ల శ్రీధర్ కొన్ని రోజులుగా డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు సమాచారం.