‘కరువు’పై మౌన దీక్ష: కోదండరాం
జేఏసీలు, రైతు సంఘాలతో కలసి చేస్తాం
* ప్రభుత్వాన్ని కదిలించేందుకే... మండల కేంద్రాల్లో పోరాటాలు
* రాష్ట్రమంతటినీ కరువు ప్రాంతంగా ప్రకటించాలి
* తెలంగాణ జేఏసీ రౌండ్‌టేబుల్ భేటీ తీర్మానం
* ఇంతటి విపత్తుపై ఇప్పటిదాకా సమీక్షైనా చేయరా?
* ఈ ప్రభుత్వం సలహాలు తీసుకునే స్థితిలో లేదు: హరగోపాల్
* వాస్తవాలను ఒప్పుకోని పాలక వర్గం ప్రజల దౌర్భాగ్యం
* విపక్షాలు బలహీనపడితే ప్రజలే విపక్షమవుతారని హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: ‘‘స్వాతంత్య్రానంతరం అతి పెద్ద కరువును ప్రస్తుతం ఎదుర్కొంటున్నాం. మునుపెన్నడూ లేని రీతిలో చివరకు తాగునీటికి కూడా కష్టాలు పడుతున్నాం. ఉపాధికి దిక్కు లేని స్థితిలో పల్లె వలస వెళ్లిపోతున్నది’’ అని తెలంగాణ జేఏసీ కరువు సమాలోచన సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రమంతటినీ కరువు పీడిత ప్రాంతంగా ప్రకటించాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. ఇంతటి విపత్కర పరిస్థితిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా కనీసం ఒక్క సమీక్ష కూడా జరపలేదంటూ తప్పుబట్టింది.
కనీసం శుక్రవారం జరగనున్న కలెక్టర్ల సమావేశంలోనైనా కరువుపై సమగ్రంగా చర్చించి రాష్ట్ర ప్రజలకు భరోసా ఇవ్వాలని కోరింది. కరువు తీవ్రతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు అన్ని జేఏసీలు, రైతు సంఘాల ప్రముఖులతో కలిసి త్వరలో ఒక రోజు మౌన దీక్ష చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రకటించారు. అన్ని పక్షాలతో చ ర్చించాక దీక్ష తేదీని ప్రకటిస్తామన్నారు. దానికి ముందు గవర్నర్‌ను కలిసి, రాష్ట్రంలో కరువుపై నివేదికను అందజేస్తామని తెలిపారు. వీటితో పాటు రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాల్లో చేపట్టాల్సిన పోరాట రూపాలపై మే 9వ తేదీన చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడించారు.
గురువారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కోదండరాం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, ప్రొఫెసర్ హరగోపాల్, రైతు సంఘాల నేతలు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, జేఏసీల నాయకులు పాల్గొన్నారు. ‘‘తక్షణం తాగునీరు సరఫరా చేయాలి. నీటి నిల్వలను పరిరక్షించాలి. పశువులకూ తాగునీరు, మేత అందించేందుకు సంరక్షణ కేంద్రాలు, గ్రామాల్లో నీటి తొట్టెల ఏర్పాటు చేయాలి.
గ్రామీణ ఉపాధి కూలీలకు వెంటనే ఉపాధి హామీ బకాయిలు చెల్లించాలి. వృద్ధులు, వికలాంగులకూ మధ్యాహ్న భోజనం అందించాలి. ఆరోగ్య సేవలందించేందుకు మొబైల్ వైద్య సేవలు అందుబాటులోకి తేవాలి. వడగాడ్పులతో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం చెల్లించాలి’’ అంటూ పలు తీర్మానాలు చేశారు.
వ్యవసాయ కమిషన్‌పై స్పందనేదీ?
వాస్తవాలను అంగీకరించని పాలక వర్గం రావడం తెలంగాణ ప్రజల దౌర్భాగ్యమని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ‘‘వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ సీఎం కాకముందే కోరా. కానీ, ప్రస్తుత ప్రభుత్వం ఏ సలహాలూ తీసుకునే స్థితిలో లేదు. కరువు ప్రకృతి వైఫల్యం కాదని, మానవ వైఫల్యమని ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ చెప్పిన మాటలను తెలంగాణ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. తెలంగాణ ప్రజలు సంయమనం పాటిస్తున్నారు’’ అని చెప్పారు.
పోరాడిన గ్రామాలు యాచిస్తున్నాయి
తెలంగాణ ఉద్యమంలో పోరాడిన గ్రామాలు ప్రస్తుతం యాచిస్తున్నాయని చుక్కా రామయ్య ఆవేదన వెలిబుచ్చారు. కరువు వల్ల పల్లెల నుంచి 60 శాతం మంది ప్రజలు వలస పోయారన్నారు. ‘‘నీళ్ల కోసం చెరువులు తవ్విస్తున్నారు గానీ, పూడికలు తీసిన కాంట్రాక్టర్లే బాగుపడ్డారు. తెలంగాణలో వ్యవసాయం ప్రకృతిపై ఆధార పడి ఉంది. తెలంగాణకు కొత్త కరువు మాన్యువల్ అవసరం. తెలంగాణ గడ్డ రాజకీయంగా నీరసపడింది. గ్రామాల పరిస్థితి దారుణంగా తయారైంది’’ అని అన్నారు.
భేటీలో ఇతర నేతల అభిప్రాయాలివీ..
ప్రస్తుత కరువుకు రాష్ట్ర ప్రభుత్వమే సగం కారణం. కరువును ఎదుర్కోవడానికి జల విధానాన్ని ప్రభుత్వం ప్రకటించాలి’’
- సారంపల్లి మల్లారెడ్డి, రైతు నేత
కరువుపై ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు పట్టింపే లేదని, గంజి కేంద్రాలు, అంబలి కేంద్రాలు కావాలని ప్రజలు కోరే దుస్థితి నెలకొంది
- పశ్య పద్మ
రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే. పెద్ద ఎత్తున ఆందోళన చేసి ప్రజా ఉద్యమంగా ముందుకెళ్తేనే ప్రభుత్వం దిగొస్తుంది
- ఏఐకేఎస్ నేత అచ్యుత రామారావు
నీరున్న బోర్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని గ్రామీణులకు తాగునీరివ్వాలి. హైదరాబాద్‌కు తాగునీటి తరలింపును నిలిపేసి తాగునీటి ఎమర్జెన్సీ ప్రకటించాలి
- నర్సింహారెడ్డి, చేతన సొసైటీ
తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిచిన పెద్దలంతా కనీసం 2 గంటలు మౌనదీక్ష చేపట్టాలి
- రఘు, విద్యుత్ జేఏసీ
కరువు ఉరుముతున్నా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు రెండేళ్లుగా పట్టించుకోవడమే లేదు
- జేఏసీ కో ఆర్డినేటర్ పిట్టల రవీందర్