సారస్వత పరిషత్ అధ్యక్షుడిగా శివారెడ్డి
సినారె స్థానంలో శివారెడ్డి ఎన్నిక
హైదరాబాద్: తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షుడిగా తెలుగు విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్స్‌లర్, ప్రముఖ సాహితీవేత్త ఆచార్య ఎల్లూరి శివారెడ్డి ఎన్నికయ్యారు. 24 ఏళ్లుగా పరిషత్‌కు అధ్యక్షుడిగా వ్యవహరించిన జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి ఇటీవల కీర్తిశేషులు కావడంతో ఆయన స్థానంలో శివారెడ్డి ఎన్నికయ్యారు. పరిషత్ కార్యవర్గం, సర్వసభ్య మండలి సమావేశమై శివారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఇప్పటివరకు పరిషత్ ట్రస్టు కార్యదర్శిగా కొనసాగిన శివారెడ్డి ఆ స్థానానికి రాజీనామా చేశారు.
ప్రస్తుతం పరిషత్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న డాక్టర్ జె.చెన్నయ్య ట్రస్టు కార్యదర్శిగా కూడా కొనసాగేలా నిర్ణయం తీసుకున్నారు. శనివారం శివారెడ్డి అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. సినారె అందించిన స్ఫూర్తితో పరిషత్ అభివృద్ధికి శక్తివంచన లేకుండా పాటుపడతానని శివారెడ్డి తెలిపారు. ఇందుకు అందరి సహకారం తీసుకొని పరిషత్‌ను తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా తీర్చిదిద్దుతానన్నారు.