సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
భాగ్యనగర్ కాలనీ: అదనపు కట్నం కోసం అత్తింటి వారు పెట్టే వేధింపులు తాళలేక ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ జానయ్య తెలిపిన వివరాల ప్రకారం..నిజాంపేట రోడ్డులోని ప్రశాంత్‌నగర్‌లో ఉంటున్న నవీన్, శైలజ (28) దంపతులకు 15 నెలల కుమారుడు కూడా ఉన్నాడు. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే. 2013 ఫిబ్రవరిలో వారి వివాహమైంది.
ఆ సమయంలో శైలజ తల్లిదండ్రులు రూ. 20 లక్షలను కట్న కానుకలుగా అప్పజెప్పారు. శైలజ తన వేతనంలో కొంత పొదుపు చేసుకుంటోంది. అయితే, ఆ డబ్బును ఇవ్వాలని, అంతే కాకుండా అదనంగా రూ. 5 లక్షలను తీసుకురావాలని ఇటీవల భర్త వేధిస్తున్నాడు. మంగళవారం రాత్రి 2 గంటల వరకు భార్యాభర్తలు గొడవ పెట్టుకున్నారు. భర్త నవీన్ ఇంటి ముందు పడుకోగా శైలజ తన కుమారుడితో బెడ్ రూంలో పడుకుంది. ఉదయం లేచి చూసే సరికి శైలజ వెంటిలేటర్‌కు చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లి సమయంలో రూ. 20 లక్షలను కట్న రూపంలో ఇచ్చామని, అది చాలదని మరింత డబ్బు తీసుకురావాలని అల్లుడు వేధిస్తున్నాడని శైలజ తల్లిదండ్రులు అంటున్నారు. భార్యను పుట్టింటికి కూడా పంపించడం లేదని ఆరోపిస్తున్నారు. కట్నం కోసమే తమ బిడ్డను తల్లిదండ్రులతో కలిసి నవీన్ చంపాడని అంటున్నారు.