లాభాల బాటలో.. కూ చుక్ చుక్
లాభాల బాటలో.. కూ చుక్ చుక్
Published Tue, Aug 8 2017 3:05 AM | Last Updated on Thu, Aug 30 2018 4:49 PM
ప్రగతి పథంలో దక్షిణ మధ్య రైల్వే
- గతేడాది కంటే ఈ సారి 11.9 శాతం అధిక లాభాలు
- 3.4 శాతం పెరిగిన ప్రయాణికులు.. సరుకు రవాణాలోనూ ముందంజ
సాక్షి, హైదరాబాద్: రోడ్డు రవాణా రంగం, ప్రైవేట్ వాహనాల నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ దక్షిణమధ్య రైల్వే ప్రగతి పథంలో దూసుకుపోతోంది. గత ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలలతో పోలిస్తే ఈసారి అదే కాలానికి 11.9 శాతం అధిక లాభాలను ఆర్జించింది. గతేడాది ఇదే సమయానికి రూ.3,860.16 కోట్ల ఆదాయం లభించగా... ఈ ఏడాది రూ.4,319.96 కోట్లు వచ్చింది. దీనిపై ఉన్నతాధికారులు సంతృప్తిని వ్యక్తం చేశారు. సరుకు రవాణా రంగంలోనూ ఈ ఏడాది దక్షిణమధ్య రైల్వే మంచి పురోగతిని సాధించింది. ప్రయాణికులకు సదుపాయాల కల్పనలో, పర్యావరణ పరిరక్షణలో, స్వచ్ఛభారత్ నిర్మాణంలో దేశంలోని మిగిలిన రైల్వేల కంటే అగ్రభాగాన నిలిచింది.
పెరిగిన ప్రయాణికులు...
తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు రవాణా రంగం నుంచి రైల్వే గట్టి పోటీని ఎదుర్కొంటోంది. అయినప్పటికీ దక్షిణమధ్య రైల్వే ఈ పోటీని అధిగమించి గతేడాది కంటే రైల్వే ప్రయాణికుల సంఖ్యను 3.4 శాతం పెంచుకోగలిగింది. గత ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో 12.64 కోట్ల మంది పయనించగా, ఈ ఏడాది ఆ సంఖ్య 13.7 కోట్లకు పెరిగింది. మొత్తం జోన్‌లోని 6 డివిజన్ల పరిధిలో రోజూ సగటున 745 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి.
సరుకు రవాణాలో...
నోట్ల రద్దు, జీఎస్టీ వంటి కీలక పరిణామాలు చోటుచేసుకున్నప్పటికీ సరుకు రవాణాలో దక్షిణమధ్య రైల్వే తన స్థానాన్ని కాపాడుకుంది. గతేడాది కంటే అధికంగా రవాణా చేసి పురోగతి సాధించడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలలకు 29 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేయగా... ఈ ఏడాది ఇప్పటి వరకు 33 మిలియన్ టన్నులకు చేరుకుంది. తద్వారా రూ.2814.04 కోట్ల ఆదాయం లభించింది. గత సంవత్సరం ఇదే కాలానికి రూ.2470 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది.
సదుపాయాలలో...
ప్రయాణికులకు సదుపాయాలు కల్పించడంలోనూ మిగతా జోన్ల కంటే ముందంజలో నిలిచింది. పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా ప్రకటించిన స్వచ్ఛతా అవార్డులలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రథమ స్థానంలో నిలవడటమే ఇందుకు నిదర్శనం. సికింద్రాబాద్, కాచిగూడ, తిరుపతి, విజయవాడ తదితర ప్రధాన స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యార్థం లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేశారు. మరోవైపు సోషల్ మీడియా ద్వారా ప్రయాణికులకు మరింత చేరువైంది. ప్రయాణికుల ¿ý ద్రత కోసం ప్రవేశపెట్టిన ‘నిర్భయ’వంటి కార్యక్రమాలు సత్ఫలితాలనిచ్చాయి. ఎంఎంటీఎస్ రైళ్లలో అమలు చేసిన ‘రిస్తా’మొబైల్ యాప్ వల్ల చాలామంది మహిళలు ఈవ్ టీజింగ్‌లను సమర్ధవంతంగా ఎదుర్కోగలిగారు. అలాగే... ఈ సంవత్సరం ఇప్పటి వరకు 82 కిలోమీటర్ల కొత్త రైల్వే మార్గాలను వేయగా, మరో 443 కిలోమీటర్లను విద్యుదీకరించారు.
Advertisement