
స్పానిష్ సంగీతం.. మెక్సికన్ నృత్యం
ఉత్సాహంగా ప్రారంభమైన ‘స్కై ఫెస్ట్’
సాక్షి, హైదరాబాద్: రెక్కలు తొడిగి ఆకాశ వీధిలో విహారం... హెలికాప్టర్ నుంచి విహంగంలా భూతలానికి పయనం... నడుమ మెక్సికన్ భామల నృత్యం... చిన్నారుల విచిత్ర వేషం... గచ్చిబౌలి స్టేడియంలో ఐదు రోజుల ‘స్కై ఫెస్ట్ 2015’ ఆరంభం అదిరిపోయింది. ‘సాక్షి’ మీడియా పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తున్న ఈ మెగా ఉత్సవాన్ని తెలంగాణ ఐటీ కార్యదర్శి జయేశ్‌రంజన్ బుధవారం ప్రారంభించారు. ఇంతటి భారీ ఈవెంట్ నగరంలో జరగడం ఇదే తొలిసారని, కుటుంబం, స్నేహితులతో కలసి జాలీగా ఆస్వాదించేందుకు ఇది చక్కని వేదికని జయేశ్‌రంజన్ అన్నారు.
సరికొత్తగా: ‘స్కై ఫెస్ట్’ నగరవాసులకు ఆసాంతం సరికొత్త అనుభూతిని పంచుతోంది. తొలుత స్టేడియంలో ప్రారంభమైన ‘హాట్ ఎయిర్ బెలూన్ రైడ్’ వినూత్నంగా సాగింది. మొత్తం ఐదు బెలూన్లలో సాగిన ఈ రైడ్‌లో జయేశ్‌రంజన్, ఆయన సతీమణితో పాటు 28 మంది పాల్గొన్నారు. వీటిల్లో ఒక బెలూన్ 12 కిలోమీటర్ల దూరంలోని తల్లాపూర్ దగ్గర ల్యాండ్ అయింది. ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన 11 మంది సభ్యుల ఆకాశగంగ టీమ్ చేసిన పారా జంపింగ్ విన్యాసం విశేషంగా ఆకట్టుకుంది. రెండు హెలికాప్టర్లలో 8000 అడుగుల నుంచి పారాచూట్‌తో జాతీయ జెండా రెపరెపలతో ఒక్కొక్కరుగా కిందకి దిగుతూ అబ్బురపరిచారు.
ఇక మెక్సికో, స్పెయిన్ సంప్రదాయ హార్ప్ మ్యూజిక్ సందర్శకులతో స్టెప్పులు వేయించింది. మెక్సికన్ సుందరాంగులు షేకింగ్ డ్యాన్స్‌లతో మతిపోగొట్టారు. పాఠశాల విద్యార్థులు ‘కల్ప పారడైజ్’ శకటాన్ని ప్రదర్శించి చెట్ల ప్రాముఖ్యత చెప్పారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా విద్యార్థినులు సంప్రదాయ దుస్తుల్లో బోనాలెత్తారు. బతుకమ్మ ఆడారు. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. వచ్చినవారంతా హైదరాబాద్ రుచులు ఆస్వాదించారు. పేద రోగులకు ఉచితంగా పాలటివ్ కేర్ చికిత్స అందిస్తున్న ‘స్పర్శ్ హాస్పైస్’ కోసం రోటరీ క్లబ్ ఈ బెలూన్ రైడ్ నిధులు వెచ్చించనుంది.