
నా కర్తవ్యాన్ని గుర్తుచేసింది: కోడెల
హైదరాబాద్: ప్రతిపక్షం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం తన కర్తవ్యాన్ని మరోసారి గుర్తుచేసిందని, సభలో సాధ్యమైనంతవరకు నిష్పక్షపాతంగా వ్యవహరించేందుకు ప్రయత్నిస్తానని స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. సభాపతిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిన అనంతరం ఆయన స్పీకర్ స్థానంలో కూర్చుని మాట్లాడారు. తనపై అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టడం కొద్దిగా బాధించిందని, అయితే తనను స్పీకర్‌గా ఏక్రగీవంగా ఎన్నుకున్నప్పుడు ప్రతిపక్ష నేత సహకరించిన తీరు ఇంకా గుర్తుందని, ఇందుకు ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞుడినై ఉంటానని తెలిపారు.
ఈ సందర్భంగా తన జీవిత ప్రస్థానాన్ని స్పీకర్ కోడెల గుర్తుచేసుకున్నారు. తన జీవితం వడ్డించిన విస్తరి కాదని, తన జీవితంలోనూ ఒడిదుడుకులు ఉన్నాయని చెప్పారు. మారుమూల గ్రామంలోనే అనేక కష్టాలు పడి పెరిగి పెద్దయ్యానని, ఓ వైద్యుడిగా మారి పేద ప్రజలకు సేవ చేశానని, ఎన్టీఆర్ ప్రోద్బలంతో రాజకీయాల్లోకి వచ్చి మంత్రిగా వివిధ పదవులు నిర్వహించానని ఆయన గుర్తుచేసుకున్నారు.