ప్రత్యేక విచారణకు ఈసీని కోరతాం
ఇరు రాష్ట్రాల్లో ఫిరాయింపులపై సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీలో ప్రజాప్రతినిధుల ఫిరాయింపుల పర్వంపై ప్రత్యేక విచారణ జరిపించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని(సీఈసీ)కోరనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి వెల్లడించారు. సోమవారం మఖ్దూంభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశం తలదించుకునేలా సాగుతున్న ఫిరాయింపులకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకోవాలని ఈసీకి లేఖ రాయనున్నట్లు తెలిపారు.
టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరినపుడు గగ్గోలు పెట్టిన చంద్రబాబు, అక్కడ చే స్తున్నది ఏమిటని నిలదీశారు. తమ పార్టీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ను ప్రలోభాలకు గురిచేసి టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయిం చేలా చేయడంపైనా ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ అంశంపై స్పీకర్‌కూ నివేదిస్తామని, అయితే స్పీకర్‌కు విజ్ఞప్తి చేయడం వల్ల ప్రయోజనం ఉండడం లేదన్నారు.
గతంలో కాంగ్రెస్ పార్టీ చేస్తే రాజకీయం, తాము చేస్తే వ్యభిచారమా అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారని, ఆయన చేసింది హోల్‌సేల్ రాజకీయ వ్యభిచారమేనని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ చేరికల్లో భాగంగా లోపాయికారీగా ఎంత డబ్బు ఇస్తున్నారనేది తెలియదు కాని, వివిధస్థాయిలోని ప్రజాప్రతినిధులకు ఇస్తున్న కాంట్రాక్టులు, పనుల అంశాన్ని పరిశీలించి, ఆర్‌టీఐను ఉపయోగించుకుని వాటిని బయటపడతామని హెచ్చరించారు.