
మేడారం స్పెషల్
హైదరాబాద్ నుంచి మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది.
మేడారం జాతరకు 480 ప్రత్యేక బస్సులు
నగర శివార్ల నుంచి ప్రత్యేక ఏర్పాట్లు
14 నుంచి 21 వరకు ప్రత్యేక బస్సుల నిర్వహణ
రోజూ 60 బస్సుల ఏర్పాటు
సిటీబ్యూరో: హైదరాబాద్ నుంచి మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. ప్రతి రెండేళ్లకు ఒకసారి వచ్చే మేడారం జాతరకు వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడుపనున్నారు. ఇందుకుగాను ప్రయాణికులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ నెల 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు రోజుకు 60 బస్సుల చొప్పున 480 అదనపు బస్సులను నడిపేందుకు ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్ ప్రణాళిక రూపొందించింది. ఈ నెల 17,18,19 తేదీల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున అవసరమైతే బస్సులను పెంచేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఆర్టీసీ రంగారెడ్డి రీజనల్ మేనేజర్ గంగాధర్ ‘సాక్షి’తో చెప్పారు. నగరంలోని అన్ని అధీకృత టికెట్ బుకింగ్ కేంద్రాల (ఏటీబీ) నుంచి అడ్వాన్స్ బుకింగ్ సదుపాయం కల్పిస్తున్నామన్నారు. కొందరు ప్రయాణికులు కలిసి పూర్తిగా ఒక బస్సును బుక్ చేసుకొనే సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నామన్నారు. మహాత్మాగాంధీ, జూబ్లీ, దిల్‌శుఖ్‌నగర్ బస్‌స్టేషన్‌లు, జగద్గిరిగుట్ట, ఉప్పల్ రింగు రోడ్డు నుంచి మేడారం స్పెషల్ బస్సులు బయలుదేరుతాయి.
50 శాతం అ‘ధన’ం....
ప్రధాన పండుగలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి 50 శాతం చొప్పున అదనపు చార్జీలు వసూలు చేసే ఆర్టీసీ మేడారం జాతరను కూడా సొమ్ము చేసుకునేందుకు సన్నాహాలు చేపట్టింది. నగరం నుంచి బయలుదేరే ఏసీ, సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సులు నేరుగా గద్దె వరకు వెళ్తాయి. ప్రతి గంటకు ఒక బస్సు చొప్పున ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు.
ప్రయాణికులకు అడ్వాన్స్ సీట్ల కోసం ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ టిఎస్‌ఆర్‌టీసీఆన్‌లైన్ డాట్ ఇన్ ’’ వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. నగరంలోని అన్ని ఆర్టీసీ అధీకత టిక్కెట్ బుకింగ్ ఏజెంట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. మేడారం జాతర బస్సులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఫోన్ : 9959226257, 99592 24910, 040-27802203,738201686 నెంబర్‌లకు సంప్రదించవచ్చు.