
ఢిల్లీ నుంచి ప్రత్యేక హోదాతోనే రావాలి
చంద్రబాబుకు నారాయణ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతోనే సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీ నుంచి రావాలని, లేనిపక్షంలో ఆయన తన పదవికి రాజీనామా చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యుడు కె.నారాయణ డిమాండ్ చేశారు. సోమవారం మఖ్దూంభవన్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ‘మంగళవారం ఢిల్లీకి వెళ్లి చేప పిల్లకు ఈత నేర్పినట్లుగా ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రధాని మోదీకి చంద్రబాబు పవర్‌పాయింట్ ప్రజేంటేషన్ ఇస్తారట. మెడ పట్టుకుని గెంటితే చూరు పట్టుకుని వేలాడినట్లుగా, బీజేపీ వాళ్లు తలుపు చెక్కతో కొడితే తమలపాకుతో సమాధానమిచ్చినట్లుగా చంద్రబాబు తీరు ఉంది’ అని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం జరుగుతున్న ప్రత్యక్ష పోరాటానికి తమ మద్దతు ఉంటుందన్నారు.
విభజన సందర్భంగా వాగ్దానం చేసిన రీతిగా ఏపీకి ప్రత్యేక హోదా, తెలంగాణకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ రావాల్సి ఉండగా ఇద్దరు సీఎంలు గట్టిగా దాన్ని డిమాండ్ చేయడం లేదన్నారు. కేంద్రానికి తెలంగాణ సీఎం కేసీఆర్ వినతిపత్రాలు ఇస్తున్నారు కానీ... అంతర్గతంగా టీఆర్‌ఎస్‌కు కేంద్ర కేబినేట్‌లో చోటు కోసం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సీఎంలిద్దరు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు నీళ్లు, ప్రాజెక్టులు, ఇతర అంశాలపై పరస్పర అవగాహనతో కూడిన లూటీ చేస్తున్నారన్నారు. రెండు రాష్ట్రాలు సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోకపోతే మహారాష్ట్ర, కర్ణాటక లాభపడతాయని, ఈ విషయంలో గవర్నర్ ఏంచేస్తున్నారని ప్రశ్నించారు. విభజన బిల్లు సందర్భంగా ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని ప్రగల్భాలు పలికిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇప్పుడేం చేస్తున్నారన్నారు.