
వెధవపని చేస్తే.. కొత్త సత్కారం!
ప్రకృతి పిలుస్తోందని బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేసేవారికి ఓ హెచ్చరిక.
ప్రకృతి పిలుస్తోందని బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేసేవారికి ఓ హెచ్చరిక. ప్రభుత్వం ఫుట్‌పాత్‌లపై బయో టాయిలెట్లను వినియోగించుకోకుండా రోడ్డు పక్కన పని కానిచ్చేరు ఓ మారు వెనక్కు తిరిగి చూసుకోండి. ఎందుకంటే మీ పని కానిచ్చే లోపు మీకు సత్కారం చేయడానికి ఒక దండ పట్టుకుని సిద్ధంగా ఉంటారు. స్వచ్ఛ భారత్‌లో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేసే వారిలో మార్పు తెచ్చేందుకు ట్రాఫిక్ పోలీసులు ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఉత్తర మండలంలోని మహంకాళి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రామస్వామి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో ప్రస్తుతం ఈ ‘సత్కారం’ చేస్తున్నారు. స్టేషన్ చుట్టు పక్కల బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తున్న వారి దగ్గరకు వెళ్లి వారికి దండ వేసి సత్కరించి ఒక గులాబి పువ్వు ఇచ్చి మరో సారి ఇలాంటిది చేయవద్దని హితబోధ చేస్తున్నారు. స్వచ్ఛ హైదరాబాద్ పేరుతో పరిశుభ్రమైన నగరం కోసం కృషి చేస్తుంటే.. ఇలా రోడ్లను అపరిశుభ్రం చేయడం మంచిది కాదని చెబుతున్నారు.
- రాంగోపాల్‌పేట్