వేగం..కళ్లెం | Speed control measures will be tightened longer | Sakshi
Sakshi News home page

వేగం..కళ్లెం

Published Tue, May 16 2017 11:59 PM | Last Updated on Tue, Sep 5 2017 11:18 AM

వేగం..కళ్లెం

వేగం..కళ్లెం

ఓఆర్‌ఆర్‌పై ‘స్పీడ్‌ గన్‌’ల నిఘా మరింత పటిష్టం
ఇప్పటికే అందుబాటులో ఐదు నిఘానేత్రాలు
కొత్తగా మరో మూడు.. నేడు ప్రారంభం
వేగ నియంత్రణ చర్యలు ఇక కఠినతరం


తీవ్రమైన ప్రమాదాలతో నిత్యం రక్తసిక్తమవుతున్న అవుటర్‌ రింగ్‌రోడ్డుపై అతి వేగానికి కళ్లెం వేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే ఉన్న ఐదు స్పీడ్‌ లేజర్‌ గన్‌ కెమెరాలకు తోడుగా బుధవారం నుంచి మరో మూడింటిని కొత్తగా అందుబాటులోకి తెస్తున్నారు. వీటి ద్వారా అతివేగంగా ప్రయాణించే వాహనదారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. తద్వారా వాహనదారుల్లో మార్పు వస్తుందని ఆశిస్తున్నారు.  – సాక్షి, సిటీబ్యూరో

సిటీబ్యూరో: రాజధాని చుట్టూ విస్తరించిన అవుటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌)పై ప్రమాదాలను అరికట్టేందుకు హెచ్‌ఎండీఏ, రాచకొండ, సైబరాబాద్‌ పోలీసులు ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఓఆర్‌ఆర్‌పై రాకపోకలు సాగించే వాహనాల వేగంలో వ్యత్యాసాలు, మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్లే భారీ  ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఇటీవల ఓఆర్‌ఆర్‌ రోడ్డు స్థితిగతులపై అధ్యయనం చేసిన న్యూఢిల్లీకి చెందిన సెంట్రల్‌ రోడ్డు రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఆర్‌ఆర్‌ఐ) రిపోర్ట్‌ వెల్లడించింది.

దీనిని ఆధారంగా చేసుకుని వేగ నియంత్రణ చర్యలు మొదలెట్టారు. ఇప్పటికే ఓఆర్‌ఆర్‌పై ఐదు స్పీడ్‌ లేజర్‌గన్‌ కెమెరాలుండగా,  మరో మూడు స్పీడ్‌ లేజర్‌ గన్‌ కెమెరాలను బుధవారం నుంచి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. వీటిని ఆదిభట్ల బొంగళూరు టోల్‌గేట్‌ వద్ద డీజీపీ అనురాగ్‌శర్మ, రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేష్‌ భగవత్, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ టి.చిరంజీవులు ప్రారంభించనున్నారు. వీటితో పాటు ఓఆర్‌ఆర్‌పై మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న వారికి చెక్‌ పెట్టేందుకు 12 బ్రీత్‌ అనలైజర్లను కూడా ట్రాఫిక్‌ పోలీసులకు అందజేయనున్నారు. స్పీడ్‌ లేజర్‌ గన్, బ్రీత్‌ అనలైజర్ల ఖర్చు అంతా హెచ్‌ఎండీఏనే భరించింది.

ఇక పక్కాగా ‘స్లో స్పీడ్‌’
వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు 2014 జనవరి 19న ఉమ్మడి సైబరాబాద్‌ పోలీసులు ఓఆర్‌ఆర్‌పై స్లో స్పీడ్‌ నిబంధనను అమల్లోకి తీసుకొచ్చారు. ఇక్కడి నాలుగు వరుసల్లో ఎంత వేగంతో వెళ్లాల్లో అప్పట్లో నిర్ణయించారు. తొలి రెండు వరుసల్లో గంటకు 80 నుంచి 120 కిలోమీటర్లు, మిగిలిన రెండు వరుసల్లో 40 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణించాలని ఆంక్షలు విధించారు. ఓఆర్‌ఆర్‌పై ప్రయాణించేందుకు 40 కిలోమీటర్ల కనిష్ట, 120 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని కలిగి ఉండాలని, భారీ వాహనాలు మూడు, నాలుగు వరుసల్లో రాకపోకలు సాగించాలని నోటిఫికేషన్‌ కూడా జారీ చేశారు. ఇష్టానుసారంగా ప్రయాణిస్తూ నిర్ణీత వేగాన్ని మీరి ఒక వరుస నుంచి మరో వరుసకు మారితే జరిమానా విధిస్తున్నారు.

మొత్తం 158 కిలోమీటర్ల ఓఆర్‌ఆర్‌పై అప్పట్లో పెద్దఅంబర్‌పేట్‌ నుంచి పటాన్‌చెరు వరకు ఈ నిబంధన అమల్లోకి తెచ్చారు. ఈ దూరాన్ని నాలుగు విభాగాలుగా విభజించి నాలుగు బృందాలతో పర్యవేక్షణ చేపట్టారు. పెద్దఅంబర్‌పేట్‌ నుంచి రావిర్యాల జంక్షన్, రావిర్యాల జంక్షన్‌ నుంచి పెద్ద గోల్కొండ, పెద్ద గోల్కొండ నుంచి రాజేంద్రనగర్‌ జంక్షన్, రాజేంద్రనగర్‌ నుంచి గచ్చిబౌలి జంక్షన్‌ వరకు వాహనాల వేగాన్ని కొలిచేందుకు ఐదు లేజర్‌ స్పీడ్‌ గన్‌ కెమెరాలను అందుబాటులోకి తెచ్చారు. సంచార వాహనాలపై వీటిని ఉంచుతూ వేర్వేరు ప్రాంతాల్లో నిఘా ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు. తొలినాళ్లలో ఈ ప్రక్రియ సత్ఫలితాన్నిచ్చింది. నిబంధన అతిక్రమిస్తే వెయ్యి రూపాయల జరిమానా విధించడంతో పాటు ఓఆర్‌ఆర్‌ ఆరంభంలో ప్రచారం చేయడంతో తొలి ఏడాది రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి. ఆ తర్వాత పోలీసుల ఆలసత్వం, స్పీడ్‌ గన్‌ కెమెరాల మొరాయింపుతో కథ మళ్లీ మొదటికిరావడం, ప్రమాదాలు పెచ్చుమీరుతుండటంతో స్లో స్పీడ్‌ నిబంధనను పక్కాగా అమలుచేసేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

మత్తును దించేస్తారు...
ఓఆర్‌ఆర్‌పై ఇప్పటివరకు డ్రంకన్‌ డ్రైవ్‌ తనిఖీలు పెద్దగా ఉండేవి కావు. వాహనాలు వేగంగా వెళ్తాయనే ఉద్దేశంత పోలీసులు ఆపే సాహసం చేసేవారు కాదు. తాజా కార్యచరణలో భాగంగా టోల్‌బూత్‌లు, డౌన్‌ ర్యాంపుల వద్ద డ్రంకన్‌ డ్రైవ్‌ను విస్తృతం చేయనున్నారు. ఆయా ప్రాంతాల్లో వాహనాలు తక్కువ వేగంతో ప్రయాణిస్తాయి కాబట్టి ఇక్కడ డ్రంకన్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపట్టనున్నారు. ఇందుకోసం సైబరాబాద్‌కు 30, రాచకొండకు 12 బ్రీత్‌ అనలైజర్లను హెచ్‌ఎండీఏ సమకూర్చింది. రాచకొండకు కేటాయించిన 12 బ్రీత్‌ అనలైజర్లను డీజీపీ అనురాగ్‌శర్మ సమక్షంలో ట్రాఫిక్‌ పోలీసులకు అందించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement