
నారా చంద్రబాబు కాదు.. నయీం చంద్రబాబు: శ్రీకాంత్ రెడ్డి
చంద్రబాబును ఆదర్శంగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామానికో నయీం తయారయ్యాడని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ఆయన నారా చంద్రబాబు కాదని, నయీం చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. ఏపీలో అవినీతి, దోపిడీ విచ్చలవిడిగా జరుగుతున్నాయన్నారు. హైదరాబాద్‌లో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.
ముఖ్యమంత్రే స్వయంగా అవినీతిని ప్రోత్సహిస్తున్నారని.. తెలుగుదేశం పార్టీకి చెందిన వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్ హ్యాండెడ్‌గా దొరకడమే అందుకు ఒక ఉదాహరణ అని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నదుల అనుసంధానం కాదు.. అవినీతి అనుసంధానం జరుగుతోందని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.
మరోవైపు నెల్లూరులో ఇదే అంశంపై వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి కూడా మాట్లాడారు. టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణ రైల్వే కాంట్రాక్టరును బెదిరించిన విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆరోపణల మీద ఎమ్మెల్యే ఏమీ మాట్లాడకపోవడంతోనే ఏం జరిగిందో అందరికీ తెలిసిందని చెప్పారు. ప్రతి అభివృద్ధి పనిలోను చంద్రబాబుకు వాటాలు ముడుతున్నాయని, అందుకే ఎమ్మెల్యేలు ఏం చేసినా పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. ఇప్పుడు రామకృష్ణ అవినీతి వెలుగులోకి రావడంతో టీడీపీ నేతలు బెల్లం కొట్టిన రాయిలా వ్యవహరిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.