హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వ నివేదన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువల సవరణపై నిర్ణయం తీసు కున్నామని ప్రభుత్వం మంగళవారం హైకోర్టుకు నివేదించింది. ఆ నిర్ణయాన్ని సోమవారం కోర్టు ముందుంచుతామని తెలిపింది. దీనిని పరిగణన లోకి తీసుకున్న కోర్టు తదుపరి విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను సవరించకపోవడాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, రైతు నాయకుడు కోదండరెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ వ్యాజ్యంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ విలువలను సవరించ కుండా భూసేకరణ నోటిఫికేషన్లు ఇస్తోందని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమయంలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది బి.మహేందర్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ మార్కెట్ విలువల సవరణ విషయంలో ప్రభుత్వం ఇప్పటికే ఓ విధానపర మైన నిర్ణయం తీసుకుందని కోర్టుకు నివేదిం చారు. అయితే, ఆ నిర్ణయాన్ని తమ ముందుం చాలని, విచారణను బుధవారానికి వాయిదా వేస్తామని ధర్మాసనం తెలిపింది. విచారణను సోమవారానికి వాయిదా వేయాలని ఆయన కోరడంతో ఇంకా ఎన్నిసార్లు వాయిదా కోరతారంటూ ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సోమవారం తమ ముందుంచాలని ధర్మాసనం ఆదేశించింది.
మార్కెట్ విలువల సవరణపై నిర్ణయం
Published Wed, Mar 8 2017 4:21 AM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM
Advertisement