చీటికీమాటికీ సమ్మెలేంటి? | State Govt takes on Strike of Aarogyhasree network hospitals | Sakshi
Sakshi News home page

చీటికీమాటికీ సమ్మెలేంటి?

Published Tue, Oct 4 2016 3:32 AM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM

చీటికీమాటికీ సమ్మెలేంటి?

చీటికీమాటికీ సమ్మెలేంటి?

ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులపై సర్కారు ఆగ్రహం
నోటీసు లేకుండా సమ్మెలపై సీరియస్
తరచూ సమ్మెకు దిగే ఆస్పత్రుల లైసెన్సు రద్దుకు యోచన
దసరాకల్లా రూ. 300 కోట్ల బకాయిల విడుదల
తక్షణమే రూ. 100 కోట్లు చెల్లించేందుకు ఏర్పాట్లు
ఇకపై నెలనెలా నిధుల విడుదలకు చర్యలు
సమ్మె విరమణకు మంత్రి లక్ష్మారెడ్డి విజ్ఞప్తి


సాక్షి, హైదరాబాద్: పెండింగ్ బకాయిల కోసం ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులు సమ్మెకు దిగడాన్ని వైద్య, ఆరోగ్యశాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. ముందస్తు సమాచారం లేకుండా చీటికీమాటికీ సమ్మెకు వెళ్లడంపై మండిపడుతోంది. తరచూ సమ్మె చేసే ఆసుపత్రులపై చర్యలు తీసుకోవడంతోపాటు వాటి లెసైన్సు రద్దు చేయాలని యోచిస్తోంది. పేద రోగులను అడ్డుపెట్టుకుని ఆస్పత్రులు బ్లాక్ మెయిల్ చేయడం సరికాదని ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.
 
 ఒకవేళ సమ్మె చేయాల్సి వస్తే నాలుగైదు రోజుల ముందే నోటీసు ఇస్తే వాస్తవ పరిస్థితిని తెలియజేస్తామని...అవసరమైతే వారి డిమాండ్లపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవడానికి వెసులుబాటు ఉంటుందని పేర్కొంటున్నారు. అలా కాకుండా ఈ ఏడాది ఇప్పటికి మూడుసార్లు సమ్మెకు వెళ్లడం వల్ల రోగుల్లో ఆందోళన నెలకొందని, వారి వైద్య చికిత్సలను పణంగా పెట్టేలా ఆస్పత్రులు వ్యవహరిం చడం మంచిది కాదంటున్నారు. ప్రభుత్వం ప్రాధాన్యం ప్రకారం నిధులను కేటాయిస్తుందని... ఒక్కోసారి ఆలస్యమైతే తమ దృష్టికి తీసుకురావాలే కానీ ఇలా చేయకూడదని వారు హితవు పలుకుతున్నారు. వెంటనే సమ్మెను విరమించాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఆస్పత్రి వర్గాలను కోరారు.
 
తక్షణం రూ. 100 కోట్లు విడుదల
ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ప్రైవేటు నెట్‌వర్క్ ఆస్పత్రులకు దాదాపు రూ. 430 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇందులో పాత బకాయిలు పోనూ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఈ నెల 2(ఆదివారం) నాటికి రూ. 246.24 కోట్లు చెల్లిం చాల్సి ఉండగా ప్రభుత్వం కేవలం రూ. 38.74 కోట్లు మాత్ర మే చెల్లించింది. అంటే ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు రూ. 207.50 కోట్లు ప్రభుత్వం బకాయి పడింది. అయితే ఆస్పత్రుల సమ్మె నేపథ్యంలో పాత బకాయిలు, ఈ ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన బకాయిల్లో దసరా నాటికి రూ. 300 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించింది.
 
ఇందులో తక్షణమే రూ. 100 కోట్లు విడుదల చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ ‘సాక్షి’కి తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియను ఆర్థిక శాఖ చేపడుతోం దని ఆయన వివరించారు. అలాగే ఇకపై ఆస్పత్రులకు నెల నెలా నిధులు విడుదల చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, ప్రభుత్వాస్పత్రులకు ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు రూ. 91.45 కోట్ల బిల్లులు చెల్లిం చాల్సి ఉండగా ప్రభుత్వం కేవలం రూ. 5.45 కోట్లే చెల్లించింది.
 
500 కోట్లు చెల్లించే వరకు సేవలు పునరుద్ధరించం
ప్రైవేటు ఆస్పత్రుల అసోసియేషన్
గత్యంతరం లేని పరిస్థితుల్లోనే తమ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలిపేయాల్సి వచ్చిందని ప్రైవేటు, నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ వెల్లడించింది. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ పరిధిలోని ఆస్పత్రులకు రూ. 500 కోట్ల బకాయిలు చెల్లించే వరకు ఆరోగ్యశ్రీ సేవలను పునరుద్ధరించబోమని తేల్చిచెప్పింది. సంఘం ప్రతినిధులు డాక్టర్ ఇంద్రాసేనారెడ్డి, డాక్టర్ హరిప్రసాద్, డాక్టర్ తిరుపతిరెడ్డి, డాక్టర్ రఘుపతిరెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పెండింగ్ బకాయిలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ప్రభుత్వ కార్యదర్శి, ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోరుుందన్నారు.
 
మే నెలలోనే బకారుులను చెల్లించాలని సమ్మె చేసినప్పుడు 2 నెలల్లో చెల్లిస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు ఆ మాటను పక్కన పెట్టిందన్నారు. ప్రభుత్వానికి నోటీసులు పంపామని, స్పందించక పోవడం వల్లే ఆరోగ్యశ్రీ సేవలను నిలిపేశామన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఒకట్రెండు ఆస్పత్రులు మినహా అన్ని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు సహా ప్రైవేటు, నర్సింగ్ హోమ్స్ యథావిధిగా ఆరోగ్యశ్రీ రోగులకు చికిత్సలు అందించాయి.  ప్రైవేటు నర్సింగ్ హోమ్స్ సమ్మె ప్రకటన నేపథ్యంలో సోమవారం ఆయా ఆస్పత్రులకు ఓపీ, ఐపీ రోగుల సంఖ్య సగానికి తగ్గింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement