పరివర్తనే ప్రగతికి మెట్టు
శిక్షణతోనే ట్రాఫిక్ ప్రమాదాలకు చెక్ ఏడాదిలో నగర వ్యాప్తంగా 12 టీటీపీలు బేగంపేట టీటీపీ ప్రారంభంలో కొత్వాల్ వెల్లడి ‘స్టాక్ హోమ్’ స్ఫూర్తితో ముందుకు: ట్రాఫిక్ చీఫ్
సిటీబ్యూరో: భాగ్యనగరం విశ్వనగరి దిశగా అడుగులు వేస్తోంది. నిత్యం ప్రజా జీవనం వేగంగా పరుగులు తీస్తోంది. దేశ విదేశాల నుంచి ఎంతోమంది వస్తూపోతుంటారు. అందమైన ఈ సిటీలో అందరినీ వేధించే సమస్య.. ‘ట్రాఫిక్’. గజిబిజి రోడ్లపై ఇష్టానుసారం దౌడుతీసే వాహనాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. మానసికంగాను, శారీరకంగాను ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే ప్రగతి సాధ్యమని, అందుకు శిక్షణ అవసరమని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ (సీఎస్సార్) కింద హీరో మోటోకార్ప్ బేగంపేటలో ఉన్న టీటీపీను అభివృద్ధి చేసింది. అత్యాధునిక సౌకర్యాలతో అందుబాటులోకి వచ్చిన దీన్ని మంగళవారం కొత్వాల్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఏడాది కాలంలో నగర వ్యాప్తంగా మరో 12 ట్రాఫిక్ ట్రైనింగ్ పార్కులు (టీటీపీ) అందుబాటులోకి తెస్తాం. రెండేళ్లల్లో నగర వ్యాప్తంగా కాప్ లెస్ జంక్షన్లను అమలు చేయనున్నాం. దీనికోసం సిటీలోని వాహనచోదకుల్లో క్రమశిక్షణను పెంచాలి. అందుకు టీటీపీలు ఉపయుక్తంగా ఉంటాయి. వాహనచోదకులు బయలుదేరే ముందే ప్రయాణించే మార్గంలో ట్రాఫిక్ స్థితిగతులను తెలుసుకుని, అనువైన మార్గం ఎంచుకోవడం కోసం మొబైల్ యాప్స్ అందుబాటులోకి తెచ్చాం. ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టం (ఐటీఎంఎస్) అమలును ప్రారంభించాం. రహదారుల్లో వాహనచోదకుల ప్రరివర్తనే ఆ దేశ క్రమశిక్షణకు నిదర్శనం’ అన్నారు. వాహనచోదకుల్లో క్రమశిక్షణ పెంపొందించడానికి కాప్‌లెస్ జంక్షన్లు తీసుకువస్తున్నామన్నారు. ఇవి విజయవంతం కావాలంటే యువత, విద్యార్థుల్లో క్రమ శిక్షణను పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు.
స్టాక్‌హోమ్ తరహాలో..
కార్యక్రమంలో పాల్గొన్న ట్రాఫిక్ చీఫ్ జితేందర్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం నగరంలో ఏటా ప్రతి లక్ష మందికి ఐదుగురు చొప్పున రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. ఈ సంఖ్య బెంగళూరులో 8.2, చెన్నైలో 29గా ఉంది. స్టాక్ హోమ్ నగరంలో 0.7గా నమోదైంది. దాన్నే స్ఫూర్తిగా తీసుకుని, నగరంలోనూ రోడ్డు ప్రమాదాలు, మరణాలు నిరోధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. హీరో మోటోకార్ప్‌కు చెందిన మహేష్, విజయ్ సేఠి మాట్లాడుతూ.. 1989లో పబ్లిక్ గార్డెన్స్‌లో చిల్డ్రన్స్ ట్రాఫిక్ పార్క్‌ను తమ సంస్థ ఏర్పాటు చేసిందన్నారు. అదే తరహాలో ఆయా పోలీసు విభాగాలతో కలిసి రూర్కెలా, ఢిల్లీ, లక్నో, గుర్గావ్‌లోనూ టీటీపీలు అభివృద్ధి చేసిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ-1 ఎల్‌ఎస్ చౌహాన్, అదనపు డీసీపీ సుంకర సత్యనారాయణ సహా పలువురు ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు. బేగంపేట టీటీపీ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (టీటీఐ) ఇన్‌స్పెక్టర్ ఎం.శ్రీనివాసులును కొత్వాల్ మహేందర్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.
ట్రాక్‌పై శిక్షణ ప్రత్యేకం
ద్విచక్ర వాహనాలు నడపటం, అందులో మెలకువలు నేర్చుకోవడానికి ఉపయుక్తంగా హీరో మోటోకార్ప్ టీటీపీని అభివృద్ధి చేసింది. దీని సేవల్ని ఎవరైనా ఉచితంగా వినియోగించుకోవచ్చు. రసూల్‌పురా చౌరస్తాలోని బేగంపేట ట్రాఫిక్ పోలీసుస్టేషన్ పక్కన నిరుపయోగంగా ఉన్న స్థలంలో ఒక్క చెట్టూ తొలగించకుండా ఈ ట్రాక్స్‌ను డిజైన్ చేశారు. భూగర్భ జలాలను పెంచేందుకు ఇంకుడు గుంతలూ (వాటర్ హార్వెస్టింగ్ పిట్స్) తవ్వారు. సదరు సంస్థ కేవలం టీటీపీని అభివృద్ధి చేయడమే కాకుండా అక్కడకు వచ్చే వారికి శిక్షణ ఇచ్చేందుకు నిపుణుల్నీ నియమించింది. ఈ టీటీపీలో ఉన్న ప్రత్యేకతలు ఇలా...
బైక్ సిమ్యులేటర్
డ్రైవింగ్‌తో ఏమాత్రం పరిచయం లేనివారికి తొలుత ఈ సిమ్యులేటర్‌పై శిక్షణ ఇస్తారు. ద్విచక్ర వాహనం మాదిరిగా ఉంటుంది. ముందు మూడు కంప్యూటర్ తెరలతో ఉండే ఈ పరికరం వినియోగిస్తున్నప్పుడు రహదారిపై వెళుతున్న భావనే కలుగుతుంది. చుట్టుపక్కల వాహనాలు వెళ్తున్నట్టు, ట్రాఫిక్ సిగ్నల్స్, స్టాప్‌లైన్స్ అన్నీ కంప్యూటర్ తెరపై కనిపిస్తాయి. ఈ సిమ్యులేటర్‌ను వినియోగిస్తూ వాహనచోదకుడు యాక్సిడెంట్ చేస్తే.. ఆ దృశ్యాలన్నీ రికార్డు అవుతాయి. తద్వారా తాను చేసిన పొరపాటు ఏంటి? ఏ విధంగా ప్రమాదానికి కారణమైంది? తదితర అంశాలు మళ్లీ చూడవచ్చు. ఈ సిమ్యులేటర్ ద్వారా ఓ వ్యక్తికి 10 శాతం డ్రైవింగ్ వస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు.
అనుభవం ద్వారా మరో 10 శాతం
డ్రైవింగ్ నేర్చుకోవాలని భావించి టీటీపీకి వచ్చేవారికి థియరీని సైతం బోధించడానికి ప్రత్యేక ట్రైనింగ్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇందులో తెరపై వివిధ ట్రాఫిక్ అంశాలపై అవగాహన కల్పిస్తూ షార్ట్ ఫిల్మ్ ప్రదర్శిస్తారు. దీంతోపాటు రోడ్ సైన్స్, రహదారి నిబంధనలు, డ్రైవింగ్‌లో కచ్చితంగా పాటించాల్సిన అంశాలను బోధిస్తారు. సిమ్యులేటర్ మాదిరిగానే ఈ థియరీ సైతం మరో 10 శాతం డ్రైవింగ్‌ను నేర్పుతుంది.
సిమ్యులేటెడ్ నారో ట్రాక్..
సన్నగా, అవసరమైన మేర వెడల్పు లేని రహదారుల్లోనే వాహనచోదకులు ఎక్కువగా ప్రమాదాల బారిన పడుతుంటారు. డ్రైవింగ్ నేర్పే సందర్భంలోనే వాహనచోదకులకు ఇరుకైన రోడ్లలోనూ వాహనాలు నడపటం ఎలా? అనేది నేర్పడానికి అనువుగా ఇక్కడ ‘నారో ట్రాక్’ ఏర్పాటు చేశారు. దీన్ని సిమ్యులేటెడ్ నారో ట్రాక్‌గా పిలుస్తారు. ఇనుముతో చేసిన 15 మీటర్ల పొడవుతో ఉండే ఈ సన్నటి ట్రాక్‌పై వాహనం నడిపించి.. ఆ సమయంలో ఎలా వ్యవహరించాలో నేర్పుతారు.
లోపాలు చెప్పే ‘డబుల్ ఎయిట్’
ఆర్టీఏ ద్వారా లెర్నింగ్ లెసైన్స్ (ఎల్‌ఎల్‌ఆర్) తీసుకున్న తర్వాత ట్రాక్‌లో నిర్వహించే డ్రైవింగ్ పరీక్షలకు వెళ్లినప్పుడు అక్కడ వాహనచోదకుడు ‘ఎనిమిది ఆకారం’లో ఉండే స్థలంలో బండిని నడపాల్సి ఉంటుంది. సదరు డ్రైవర్‌కు వాహనం నడపడంపై ఉన్న పట్టును తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. బేగంపేట టీటీపీలో దేశంలో తొలిసారిగా ‘డబుల్ ఎయిట్’ ట్రాక్ ఏర్పాటు చేశారు. ఇందులో ‘ఎనిమిదికి’ అదనంగా మరో ‘సున్నా’ ఆకారం చేరుతుంది. ఫలితంగా డ్రైవింగ్‌పై డ్రైవర్‌కు ఉన్న పట్టును మరింత పక్కాగా గణించి, లోపాలు సరిచేసే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 11 మీటర్ల పరిధితో దీన్ని ఏర్పాటు చేశారు.