=హైఎండ్ మోడల్సే అత్యధికంగా తరలింపు
=‘రిటర్న్ మాల్’ ముసుగులో గుట్టుగా రవాణా
=పక్కా వ్యవస్థీకృతంగా సాగుతున్న వ్యవహారం
=రికవరీలు కష్టంగా మారిన వైనం
సాక్షి, సిటీబ్యూరో: ఒకప్పుడు... చోరీ చేసిన ఫోన్లను
యథాతథంగా వినియోగించడం/విక్రయించడం..
ఆ తరవాత... ఐఎంఈఐ
నెంబర్ల ట్యాంపరింగ్/క్లోనింగ్ చేసి వాడటం..
ఇప్పుడు.. అత్యంత ఖరీదైన చోరీ సెల్‌ఫోన్లను
గుట్టుగా పొరుగు దేశానికి తరలించడం..
నగరంలో తస్కరణకు గురవుతున్న సెల్‌ఫోన్లలో అత్యధిక భాగం చైనాకు తరలిపోతున్నాయని పోలీసులు గుర్తించారు. ఫలితంగానే వీటిని రికవరీ చేయడం కష్టంగా మారుతోందని చెప్తున్నారు. అనధికారిక సమాచారం ప్రకారం నగర వ్యాప్తంగా ఏటా 20 వేల వరకు సెల్‌ఫోన్లు చోరీకి గురవుతున్నాయి. నగరంలో అనేక చోటామోటా ముఠాలు సెల్‌ఫోన్ పిక్‌పాకెటింగ్, స్నాచింగ్‌ను వ్యవస్థీకృతంగా చేస్తున్నాయి.
పర్సుల నుంచి సెల్‌ఫోన్ల వరకు..
పిక్‌పాకెటింగ్ గ్యాంగ్‌లు ఒకప్పుడు పర్సుల్ని మాత్రమే టార్గెట్ చేసేవి. అయితే ప్లాస్టిక్ కరెన్సీగా పిలిచే క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగం పెరిగిన తరవాత పర్సులతో ‘గిట్టుబాటు’ కావట్లేదు. అందుకే ఇటీవల కాలంలో పర్సుల్ని వదిలేసి సెల్‌ఫోన్లపై పడ్డారు. కరుడుగట్టిన రౌడీషీటర్లు ఫయాజ్, ఖైసర్, షేరూ, లతీఫ్ తదితరులు ముఠాలు కట్టి మరీ వ్యవస్థీకృతంగా సెల్‌ఫోన్ చోరీలకు పాల్పడుతున్నారని పోలీసులు చెప్తున్నారు. ఈ ముఠాలు పరిధులను సైతం ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఒకరి ఏరియాల్లోకి మరోకరు ప్రవేశిస్తుండటంతో అనేక సందర్భాల్లో గ్యాంగ్ వార్స్ జరిగి హత్యల వరకు వెళ్తున్నాయి.
గతంలో ఐఎంఈఐ నెంబర్ మార్చేసి..
ప్రతి సెల్‌ఫోన్‌కీ ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ (ఐఎంఈఐ) నెంబర్ ఉంటుంది. ఏ రెండు ఫోన్లకూ ఒకే నెంబర్ ఉండదు. సదరు సెల్‌ఫోన్‌ను ఏ వ్యక్తి వినియోగిస్తున్నది తెలుసుకోవడానికి ఇది ఉపకరిస్తుంది. ఐఎంఈఐ నెంబర్ ట్యాంపర్ చేసేందుకు ఉపకరించే గ్యాడ్జెట్స్ విపణిలో లభిస్తున్నాయి. చోరీ ఫోన్లను దొంగల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసే వ్యక్తులు ఈ గ్యాడ్జెట్స్‌ను వినియోగించి దానికి ఉన్న నెంబర్‌కు బదులు మరో నెంబర్ కేటాయించే వారు. మరోపక్క పనికి రాని పాత ఫోన్లను రూ.వందల్లో కొనుగోలు చేస్తూ వాటి ఐఎంఈఐ నెంబర్ స్ట్రిప్‌ను ట్యాంపరింగ్ ద్వారా సేకరించి చోరీ ఫోన్లకు వేసే వారు. దీనివల్ల చోరీ ఫోన్లను పట్టుకోవడం సాధ్యం కాదు.
ఇప్పుడు ఏకంగా సరిహద్దులు దాటిస్తూ..
ఇటీవల కాలంలో ఈ చోరీ సెల్‌ఫోన్లను కొనుగోలు చేసే మారు వ్యాపారుల పంథా పూర్తిగా మారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. నగరంలోని అనేక ప్రాంతాల్లో ఈ తరహా వ్యాపారాలు ప్రారంభించిన చోరీ మాల్ వ్యాపారస్తులు సిండికేట్స్‌గా చైనా మార్గాన్ని ఎంచుకున్నట్లు ఆధారాలు సేకరించారు. గడిచిన కొన్నేళ్లుగా చైనా నుంచి పలు వస్తువుల్ని దిగుమతి చేసుకోవడం సాధారణమై పోయింది. ఇలా వచ్చిన దాంట్లో కొంత వివిధ కారణాల నేపథ్యంలో తిరిగి పంపిస్తారు. వీటితో కలిపి చోరీ ఫోన్లను చైనాకు పంపేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. పక్కా ప్రొఫెషనల్ చోరుల నుంచి కొన్న ఖరీదైన హై-ఎండ్ ఫోన్లను మాత్రమే ఇలా పంపిస్తున్నట్లు నిర్ధారిస్తున్నారు. ఈ కారణంగానే చోరీకి గురైన హై-ఎండ్ సెల్‌ఫోన్లను రికవరీ చేయడం అసాధ్యంగా మారినట్లు చెబుతున్నారు. దీని వెనుకున్న సూత్రధారులపై పోలీసులు కన్నేశారు.
జాగ్రత్తలే మేలు..
సెల్‌ఫోన్లు కోల్పోయిన బాధితులను ఎక్కువగా ఆందోళనకు గురి చేసేది దాని ఖరీదు కంటే అందులో ఉన్న డేటానే. ఫలితంగా ఫోన్ పోతే.. దాదాపుగా అందరితోనూ సంబంధాలు తెగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
ప్రతి సెల్‌ఫోన్‌కీ ఐఎంఈఐ నెంబర్ ఉంటుంది. మీ సెల్‌ఫోన్‌లో బటన్లు నొక్కితే ఈ నెంబరు డిస్‌ప్లే అవుతుంది. ఈ సంఖ్యను నోట్ చేసుకోవాలి. ఫోను పోతే దీన్ని బట్టి ఆచూకీ కనుక్కోవచ్చు.
మీ సెల్‌ఫోన్‌కు సెక్యూరిటీ లాక్ పెట్టుకోవాలి. ప్రతి ఫోనులోనూ ఉన్న మెనూలో సెట్టింగ్స్, సెక్యూరిటీ సెట్టింగ్స్‌లో ఇది అందబాటులో ఉంటుంది. దీన్ని సెట్ చేసుకోవడం వల్ల మన ఫోను ఎవరికైనా దొరికినా, దొంగిలించినా.. వినియోగించుకోడం వారి, అందులోని వ్యక్తిగత డేటాను చూడటం వారి వల్లకాదు.
ప్రస్తుతం కొన్ని సర్వీస్ ప్రొవైడర్ కంపెనీలు, వెబ్‌సైట్స్ ఫోన్‌బుక్‌తో పాటు కొంత డేటా, ఫొటోలు బ్యాకప్/స్టోర్ చేసుకునే సౌకర్యాన్ని అందిస్తున్నాయి. వీటి ద్వారా విలువైన డేటా జాగ్రత్తగా ఉంచుకోవచ్చు
ఫోన్ నెంబర్లను సెల్‌లో ఫీడ్ చేసుకోవడంతో పాటు ఆ డేటా మొత్తాన్ని కంప్యూటర్‌లో, సీడీల్లో భద్రపరుచు కోవడం/రాసి పెట్టుకోవడం మంచిది